సాధారణం నుంచి భారీ స్థాయిలో వర్షాలు కురిసినా తిరుమల మాడవీధుల్లో చేరిన వరద నీరు బయటకు వెళ్లడానికి వీలుగా మురుగు నీటి వ్యవస్థ ఉంది. తూర్పు, ఉత్తర మాడవీధులతో పాటు మహద్వారం ప్రాంతాల్లో వరదనీరు బయటకు వెళ్లడానికి రాంభగీచ వసతి గృహాలు, వెంగమాంబ అన్నదాన సత్రాల ప్రాంతాల్లో భారీ మురుగు కాలువ నిర్మించారు. నివర్ తుపాను ప్రభావంతో అతి భారీ వర్షం కురవడంతో మాడ వీధులు, ఎగువ ప్రాంతాలైన ధర్మగిరికి వెళ్లే రహదారి, మ్యూజియం పరిసర ప్రాంతాల్లోని వరద నీరు గోవింద నిలయం నుంచి పశ్చిమాన నాలుగో గేటు ద్వారా మాడవీధిలోకి ప్రవేశించి దక్షిణం మీదుగా మహద్వారం వైపు చేరింది.
ధర్మగిరి రహదారి నుంచి కృష్ణకొలను వరకు..
మాడ వీధుల్లోకి నీరు చేరిన రోజున వరద నీటి ప్రవాహాన్ని పరిశీలించిన తితిదే ఇంజినీరింగ్ అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలపై పరిశీలన చేశారు. ధర్మగిరి వెళ్లే రహదారి వైపు నుంచి వచ్చే వరదనీరు మాడవీధుల్లోకి రాకుండా మళ్లించడానికి ప్రణాళికలు రూపొందించారు. ధర్మగిరి రహదారి నుంచి గుబ్బాసత్రం, మ్యూజియం, పునరావాసకాలనీ, కృష్ణతేజ అతిథిగృహం మీదుగా కృష్ణ కొలనుకు చేరేలా మురుగు కాలువ నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. వరద నీరు ప్రవహించడానికి వీలుగా మూడు అడుగుల వెడల్పు, మూడు అడుగుల లోతుతో దాదాపు నాలుగు వందల మీటర్ల మేర కృష్ణ కొలను వరకు కాలువ నిర్మిస్తారు. అక్కడి నుంచి వరద నీరు అళ్వార్ చెరువుకు చేరి అటు నుంచి శ్రీవారి మెట్టు ప్రాంతం వైపు వెళుతుంది.
ఇవీ చూడండి: