tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. భక్తులతో అలిపిరి తనిఖీ కేంద్రం కిటకిటలాడుతోంది. తితిదే శ్రీవారి దర్శనం టోకెన్లు సంఖ్య పెంచడం, కరోనా ఉద్ధృతి తగ్గడంతో తిరుమలకు వచ్చే యాత్రికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. వేలాది మంది భక్తులు వాహనాల్లో తరలి వస్తున్నారు. ఈ ఉదయం అలిపిరి వద్దకు వందలాది వాహనాలు వరుస కట్టాయి.
అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద సాధారణంగా తనిఖీలు చేసే 8వరుసలు కాకుండా అదనంగా మరో నాలుగు వరుసల్లో తనిఖీలు చేసి వాహనాలను పంపుతున్నారు. తనిఖీ కోసం అలిపిరి వద్ద వాహనాలు గంటకుపైగా వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
ప్రత్యేక పర్వదినాల్లో మాత్రమే కనిపించే ఇంతటి రద్దీ కరోనా తర్వాత ఒక్కసారిగా చూడడంతో అధికారులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ వాహనాల్లో వచ్చే భక్తుల కంటే సొంత వాహనాల్లో వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా కనిపించడంతో.. అదనపు సిబ్బంది ద్వారా వాహనాలను తనిఖీ చేస్తున్నారు.
ఇదీ చదవండి : భాకరాపేటలో దివ్యాంగుల ధర్నా.. మునీంద్రను ఉరితీయాలని డిమాండ్