తిరుపతిలో తిరుచానూరు మార్కెట్ యార్డు నుంచి లక్ష్మీపురం కూడలి, రామానుజ కూడలి, ఎమ్మెస్ సుబ్బలక్ష్మి విగ్రహం, లీలామహల్ వరకు రద్దీ నేపథ్యంలో గరుడ వారధి నిర్మాణం చేపట్టారు. లీలామహల్ సర్కిల్ నుంచి కపిలతీర్థం ముందు భాగంలో వంతెన నుంచి రహదారి పైకి దిగేలా పనులు చేపట్టారు. తాజాగా అలిపిరి వరకు పైవంతెన నిర్మాణాన్ని విస్తరిస్తామని తితిదే ధర్మకర్తల మండలి ప్రకటించింది. గరుడ వారధి విస్తరణను తిరుపతి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఈ దారిలో వాహనాలకు అంతరాయం కలిగే పరిస్థితులు లేకపోయినా వారధి పరిధిని పెంచాలనుకోవడం సరికాదంటున్నారు.
గరుడ వారధి తొలి దశ నిర్మాణాలు నత్తనడకన సాగుతూ ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో వారధి పరిధిని పెంచాలని తితిదే ధర్మకర్తల మండలి తీసుకొన్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. రహదారికి ఇరువైపులా విస్తరించిన పచ్చదనంతో ఆధ్యాత్మికత, ఆహ్లాదం కలగలసిన కపిలతీర్థం-అలిపిరి రహదారి గరుడ వారధి నిర్మాణాలతో కనుమరుగయ్యే అవకాశం ఉందని నగరవాసులు మండిపడుతున్నారు. మార్కెట్ యార్డు నుంచి కపిలతీర్థం వరకు చేపట్టిన గరుడ వారధి నిర్మాణాలు ఏడాది కిందట పూర్తి కావాల్సి ఉన్నా నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేయకుండా పొడిగింపు నిర్ణయం ఎందుకంటూ నగరవాసులు ప్రశ్నిస్తున్నారు.
ఇదీచదవండి.