గుప్త నిధుల వేట కోసం వెళ్లి ఇద్దరు వ్యక్తులు విద్యుత్ షాక్తో ఆస్పత్రిలో చేరిన ఘటన చిత్తూరు జిల్లా పలమనేరులో జరిగింది. పలమనేరు పోలీసులు పది మందిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉండగా.. ఇద్దరు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ఈ 14 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అరెస్ట్ చేసిన 10 మందిని రిమాండ్కు తరలించనున్నట్లు పలమనేరు సీఐ శ్రీధర్ తెలిపారు.
వివరాలు ఇవీ...
పలమనేరు మండలం దొడ్డిపల్లి అటవీ పరిధిలో కంసలోని ఉంట వద్ద ఫిబ్రవరి 12వ తేదీన పూజలు నిర్వహించి గుప్తనిధుల కోసం గోతులు తీసి.. సగం పని ముగించుకుని వచ్చారు. 15వ తేదీన తిరిగి అడవిలోకి వెళ్తుండగా రైతులు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి ఇద్దరి వ్యక్తులకు తీవ్రగాయాలై ఆసుపత్రిలో చేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు సమగ్ర దర్యాప్తు చేశారు. 14 మందిపై కేసులు నమోదు చేసి..10 మందిని అరెస్టు చేశారు. విద్యుత్ తీగలు ఏర్పాటు చేసిన రైతులపైనా చర్యలు తీసుకున్నారు.
ఇదీ చదవండి: ప్రేమను ఒప్పుకోలేదని యువతికి పురుగుల మందు తాగించాడు