చిత్తూరు జిల్లాలోని ఏర్పేడు మండలం చితలపాళ్ళెంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ భూముల్లో సాగు చేయడానికి యత్నించిన రైతులను.. షికారీలు అడ్డుకున్నారు. తమ భూములను ఆక్రమించారని రైతులు ఆందోళనకు దిగారు. తమ సంతకాలు ఫోర్జరీ చేసి భూములు విక్రయిస్తున్నారని ఆరోపించారు.

దాదాపు 530 ఎకరాలకు సంబంధించి రైతులు, షికారీల మధ్య కొన్నేళ్లుగా వివాదం జరుగుతోంది. సర్వే నంబర్ 350 నుంచి 450 వరకు గల 530 ఎకరాలకు సంబంధించి గత కొన్నేళ్లుగా రైతులు, షికారీల గొడవ జరుగుతోంది. 1970 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం షికారీలకు డీకేటి పట్టాలు అందచేసింది. కొంతకాలం తర్వాత షికారీల నుంచి రైతులు భూములు కొనుగోలు చేశారు.

నిబంధనల మేరకు డీకేటీ భూములు క్రయ విక్రయాలు చేయకూడదు. భూములు కొనుగోలు చేసిన రైతులు 1985 నుంచి సాగు చేస్తుండటంతో అనుభవ పట్టాలు పొందారు. తమ సంతకాలు ఫోర్జరీ చేసి తాము విక్రయించినట్లు.. తప్పడు పత్రాలు సృష్టించి రైతులు తమ భూములు ఆక్రమించారని షికారీలు ఆరోపిస్తూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో ఇరువర్గాలు మధ్య వివాదం తారాస్థాయికి చేరింది.

ఇటీవల షికారీలకు చెందిన ఓ యువకుడు హత్యకు గురయ్యారు. పరిస్థితి విషమించడంతో భూ వివాదంపై ప్రత్యేక అధికారిని నియమిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పలుమార్లు వివాద ప్రాంతాన్ని పరిశీలించారు. సమస్య పరిష్కారం కాకపోవటంతో రైతులు భూమి సాగు చేయటానికి ప్రయత్నించారు. షికారీలు అడ్డుకొంటున్నారు. రైతులు ఇవాళ భూమి సాగు చేయటానికి ప్రయత్నించటంతో మరోసారి షికారీలు అడ్డుకొన్నారు.
ఇదీ చదవండి: న్యాయమూర్తి రామకృష్ణ సోదరుడిపై దాడి: చంద్రబాబుకు డీజీపీ లేఖ