A tense constituency in Punganur: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా పుంగనూరులో ఏ కార్యక్రమం జరగకూడదన్న రీతిలో అనుచరవర్గం వ్యవహరిస్తోంది. పోలీసులు సైతం వారికే వంతు పాడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పారిశ్రామికవేత్త రామచంద్రయాదవ్ రైతుభేరి కార్యక్రమాన్ని అడ్డుకుని, ఇల్లును ధ్వంసం చేసిన మంత్రి అనుచరుల ప్రోద్బలంతో..కొంతమంది మహిళలు రామచంద్ర యాదవ్‌కు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. 2019 ఎన్నికల వేళ ఒక్కో మహిళకు రెండువేల రూపాయలు ఇస్తామన్న హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
ఓవైపు డబ్బులు చెల్లించాలని మహిళలు పట్టణంలోని అంబేడ్కర్ కూడలి వద్ద ఆందోళన చేస్తుంటే మరోవైపు పోలీసులు.. తమ విధులు మంత్రి కోసమే అన్నట్లు వ్యవహరించారు. రామచంద్ర యాదవ్‌కు సంఘీభావం తెలిపేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బీసీ, ప్రజాసంఘాలనేతల్ని ఆయన ఇంటి వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకొన్నారు. మంత్రి అనుచరులు మహిళలతో కావాలనే తప్పుడు ప్రచారాలతో నిరసనలు చేయిస్తున్నారని మండిపడ్డారు. దాడి చేసిన వారిని అరెస్ట్ చేయకుండా..పరామర్శకు వచ్చిన వారిని అదుపులోకి తీసుకోవడమేంటని ప్రశ్నించారు. ప్రజా సమస్యలను తెలుసుకొనేందుకు చేపట్టిన కార్యక్రమాలను అడ్డుకొంటున్న పోలీసులు..ఇంటిపై దాడికి దిగి హత్యచేసేందుకు యత్నించినా సరైన కేసులు నమోదు చేయలేదని రామచంద్రయాదవ్ ధ్వజమెత్తారు. పోలీసులపై న్యాయపోరాటం చేస్తానని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: