చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో హంద్రీనీవా జల సాధన కోసం కుప్పం బ్రాంచి కాలువ పనుల పూర్తి చేయాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు. తెదేపా ఆధ్వర్యంలో జల సాధన పోరుబాట కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభించనున్నట్లు నాయకులు తెలిపారు.
తెదేపా హయాంలో 80 శాతం పూర్తి
చిత్తూరు జిల్లా కుప్పం పలమనేరు నియోజకవర్గంలో సాగు, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపే లక్ష్యంతో గత ప్రభుత్వంలో కుప్పం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. కృష్ణా, గోదావరి జలాలను హంద్రీనీవా కాలువ ద్వారా రెండు నియోజకవర్గాలను సస్యశ్యామలం చేయాలన్న ఆశయంతో కుప్పం బ్రాంచ్ కాలువను సుమారు 120 కిలోమీటర్ల పరిధిలో చేపట్టామని తెదేపా నాయకులు గుర్తుచేశారు. దాదాపు 80 శాతం పనులు పూర్తయ్యాయని వెల్లడించారు.
అధికారంలోకి వచ్చాక ఆగాయి
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైనా హంద్రీనీవా ప్రాజెక్టు పనులను పట్టించుకోవటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వీరు ఎదుర్కొంటున్న సాగు, తాగు నీటి కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పనులను పూర్తి చేయించాలని ప్రతిపక్ష తెదేపా నేతలు నిర్ణయించారు.
వారం రోజులపాటు పాదయాత్ర
పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సూచనల మేరకు హంద్రీనీవా కాలువ వెంబడి పాదయాత్రలు చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించామని తెదేపా నేతలు తెలిపారు. సుమారు 120 కిలోమీటర్ల పరిధిలో పాదయాత్రను.. వారం రోజుల పాటు నిర్వహించేలా కరపత్రాలను ఆవిష్కరించారు. బ్రాంచి కాలువ పనులు పూర్తి చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని ఎమ్మెల్యే శ్రీనివాసులు పేర్కొన్నారు.
ఇదీ చూడండి..
'కిర్గిస్థాన్‌లోని తెలుగు విద్యార్థులను స్వదేశానికి రప్పించండి'