40 శాతం రాయితీతో ప్రభుత్వం అందజేసే వ్యవసాయ యంత్ర పరికరాలు ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా రైతులకు చేరటం లేదు. బృందాలుగా ఏర్పడి దరఖాస్తు చేసుకొన్న రైతులు... ఇప్పటికే తమ వంతు వాటా చెల్లించారు. వర్షాలు పడి నారుమళ్లు, ఉడుపులు పూర్తవుతున్నా.. ఇంకా తమ చేతికి యంత్రాలు అందలేదని వాపోతున్నారు. చిత్తూరు జిల్లాలో 3 లక్షల హెక్టార్ల సాగు విస్తీర్ణంలో మూడో వంతు మామిడి పంట సాగవుతోంది. మిగిలిన 2 లక్షల హెక్టార్లలో వరితోపాటు వేరుశనగ వంటి వాణిజ్య పంటలు, టమోటా, మిరప వంటి ఉద్యాన పంటలు పండిస్తున్నారు. తూర్పు ప్రాంతాల్లో వరినాటు వేసే సీడ్ డ్రమ్మర్, వేరుశనగ విత్తనాలు నాటే యంత్రాలు.. పశ్చిమ ప్రాంతాల్లో దుక్కిచేయడానికి మడకలు, రోటవేటర్, పురుగు మందులు పిచికారీ యంత్రాలు అవసరమవుతాయి. వీటి కోసం రైతులు దరఖాస్తు చేసుకోవటమేగాక.. తమ వాటానూ చెల్లించారు. ఇప్పటికీ వాటి కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు..
కనీసం అద్దె యంత్రాలు కూడా లేవు..!
గతంలో వ్యవసాయ పనిముట్లను రాయితీపై వ్యక్తిగతంగా రైతులకు అందచేసేవారు. రెండేళ్లుగా సరికొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. నలుగురు నుంచి ఐదుగురి వరకు బృందాలుగా ఏర్పడిన రైతులకు మాత్రమే రాయితీ వ్యవసాయ యంత్ర పరికాలు అందచేస్తుండగా రైతు భరోసా కేంద్రాల వద్ద అద్దె వ్యవసాయ యంత్రాల కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. సొంత యంత్రాలు సమయానికి ఇవ్వకపోగా... ఆర్బీకేల్లో అద్దె యంత్రాలు లేవని రైతులు వాపోయారు.
జిల్లా వ్యాప్తంగా 286 గ్రూపులు ఏర్పాటుకాగా ఇప్పటివరకూ 123 గ్రూపులకు మాత్రమే యంత్రాలు ఇచ్చేందుకు అధికారులు నిర్ణయించారు. త్వరలోనే మిగిలిన గ్రూపులకూ ఇస్తామని చెప్పారు. ఇప్పటివరకు జిల్లాలో రూ. 3 కోట్ల 40 లక్షల రూపాయలతో వ్యవసాయ యంత్ర పరికరాలు అందజేసినట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. తమ వాటాతోపాటు... రాయితీ మొత్తాన్నీ చెల్లించి బ్యాంకు రుణాలు తీసుకుని యంత్రాలు కొనుగోలు చేసిన కొంతమంది రైతులు ప్రభుత్వం ఇచ్చే రాయితీ కోసం ఎదురుచూస్తున్నారు.
ఇదీ చూడండి. Eluru Elections results : వైకాపా ఖాతాలో ఏలూరు కార్పొరేషన్..మూడుచోట్ల తెదేపా విజయం