పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూనే.. అభివృద్ధి పనులు చేపడుతున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు. అలిపిరి టోల్‌గేట్ నుంచి చెర్లోపల్లె వరకు ఆరు కిలోమీటర్ల మేర రహదారిని 4 లేన్లకు విస్తరిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర జంతు ప్రదర్శనశాల మీదుగా.. చెర్లోపల్లె వెళ్లే ఈ రహదారిలో అరుదైన ఎర్రచందనం చెట్లతో పాటు వేప, రావి, చింత వంటి వివిధ రకాల వృక్షాలు వేలల్లో ఉన్నాయి. రహదారి విస్తరణలో భాగంగా 2వేల 300కు పైగా చెట్లను తొలగించాల్సిందిగా తితిదే అధికారులు గుర్తించారు.
అలా చేస్తే పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని భావించి.. రహదారి నిర్మాణాల ఆకృతులను మార్చారు. దీని వల్ల దాదాపు 1350 చెట్లకు ముప్పు తప్పింది. మిగిలిన వెయ్యి చెట్లను తొలగిస్తేనే పనవుతుందని గమనించి.. వాటిని సురక్షితంగా పెకిలించి ఇతర ప్రాంతాల్లో నాటాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా.. 193 చెట్లను క్రేన్ల సాయంతో పెకిలించి.. అలిపిరిలోని అటవీ ప్రాంతంలో తిరిగి నాటుతున్నారు.
ఆధునిక పద్ధతులను అనుసరిస్తూ చెట్లను తరలిస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం డీఎఫ్వో చంద్రశేఖర్ తెలిపారు. చెట్టు పెకిలించేటప్పుడు, తరలింపు, తిరిగి నాటే సమయాల్లో నిర్దేశిత ప్రమాణాలను అనుసరిస్తున్నామని.. రోజుకు 3-4 చెట్లు మాత్రమే తరలిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.
ఇదీ చదవండీ...