Snake bites: పాము పేరు వింటేనే ఆ కుటుంబం వణుకుతోంది. 45 రోజుల వ్యవధిలో నలుగురు కుటుంబ సభ్యులను ఆరుసార్లు పాము కాటేయడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం దోర్నకంబాల పంచాయతీ మల్లయ్యపల్లి ఆదిఆంధ్రవాడకు చెందిన ఓ కుటుంబాన్ని పాము పీడకలలా వెంటాడుతోంది. వెంకటేష్ తన భార్య వెంకటమ్మ, కుమారుడు జగదీష్, తండ్రితో కలిసి వ్యవసాయ పనులు చేసుకుంటూ అటవీ ప్రాంతం సమీపంలోని కొట్టంలో జీవనం సాగిస్తున్నారు. శనివారం రాత్రి జగదీష్ ఆరుబయట నిద్రిస్తున్న సమయంలో అతడి కాలుపై పాము కాటువేసింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే అతడిని రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. గతంలో వెంకటేష్ రెండుసార్లు, ఆయన తండ్రి, భార్య, కుమారుడు ఒక్కోసారి పాము కాటుకు గురయ్యారు. తాజాగా కుమారుడు జగదీష్‌ను మరోసారి పాము కాటు వేసింది. బాధిత కుటుంబ సభ్యులు మరోచోటికి వెళ్లడానికి అంగీకరించడం లేదు. పాము బెడద నుంచి కాపాడాలని అధికారులను కోరుతున్నారు.
ఆ ప్రాంతంలో వారికి పాముల బెడద ఉన్నప్పటికీ.. బతుకుదెరువును వదులుకొని వెళ్లలేక అక్కడే జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం స్పందించి తమకు పక్కా గృహాలు నిర్మిస్తే ఇలాంటి పరిస్థితి రాదని బాధితులు వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి: EMT Suicide Attempt: తాత చనిపోతే సెలవడిగాడు..పై అధికారి నమ్మలేదు... చివరికి ఏమైందంటే..!