Nara Lokesh Yuvagalam Padayatra : తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర.. 17వ రోజున గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని కొత్తూరు నుంచి నగరి నియోజకవర్గం చినరాజకుప్పం వరకు 17.7 కిలోమీటర్ల మేర సాగింది. దారి పొడవునా ప్రతి ఒక్కరిని పలకరిస్తూ, సమస్యల్ని ఆరా తీస్తూ ముందుకు సాగిన లోకేశ్.. గౌడ, మైనారిటీల వర్గాల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి రాగానే పన్నులు తగ్గించి డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గిస్తామన్నారు.
ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి సొంతూరు డీఎం పురంలో లోకేశ్‌కు స్థానికులు హారతులు, గజమాలలతో స్వాగతం పలికారు. గ్రామ సమస్యలను వివరించారు.
"స్టూల్ తీసేస్తే ఇల్లు ఎక్కి మాట్లడుతా. అది కాకపోతే మా నాయకుల భుజలపై ఉండి మాట్లడుతా. చైతన్యం తీసుకువస్తున్నాను కాబట్టే అడ్డంకులు సృష్టిస్తున్నారు. అయినా పర్వాలేదు పోరాడుతా. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ధరలు పెరగలేదు. ఆర్టీసీ ఛార్జీలు పెరగలేదు. ఉద్యోగాలు వచ్చాయి." -నారా లోకేశ్, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి
సీఎం జగన్ వ్యవస్థలంటినీ ధ్వంసం చేశారని, రాష్ట్రాన్ని అప్పులమయం చేశారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పోరాటం చేసి వైఎస్సార్సీపీ సర్కార్‌ను ఇంటికి పంపించాలని పిలుపునిచ్చారు. 18 వ రోజున చినరాజకుప్పం నుంచి యాత్ర ప్రారంభించనున్న లోకేశ్.. పుత్తూరు బహిరంగసభలో పాల్గొననున్నారు.
ఇవీ చదవండి :