పేదలకు కేంద్ర ప్రభుత్వం గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద ఈ నెల 16 నుంచి 27 వరకు కార్డుదారులకు బియ్యం, ఒక కిలో శనగలు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు జేసీ మార్కండేయులు తెలిపారు. అంత్యోదయ అన్నయోజన (ఏఏవై), అన్నపూర్ణ (ఏఏపీ) కార్డులకు గతంలో రెగ్యులర్‌గా ఇచ్చే 35 కిలోలు, 10 కిలోలు కాకుండా ఏఏవై, ఏపీ కార్డులకు ప్రతి సభ్యునికి ఐదు కిలోల బియ్యం అందజేస్తామన్నారు. కరోనా నియంత్రణలో భాగంగా 2,901 చౌకధరల దుకాణాలతో పాటు అదనంగా 73 కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. సంబంధిత అధికారి వేలిముద్ర లేకుండా రేషన్ ఇవ్వరాదని జేసీ స్పష్టం చేశారు.
డీలర్లు సంచులు తిరిగివ్వాలి
చౌకధరల దుకాణాల డీలర్లు బియ్యం గోనె సంచులను వాపసు ఇవ్వాలని పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజరు మంజుభార్గవి కోరారు. లాక్‌డౌన్ వల్ల గోనెసంచుల కొరత ఉన్నందున దుకాణాల్లో ఉన్న వాటి సంచులతో పాటు ప్రస్తుత కోటా సంచులను తిరిగి ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వం గోనెసంచి ధర రూ.17కు నిర్ణయించే అవకాశం ఉందని, ధర ఖరారు కాగానే ఆ నగదును డీలర్లకు అందజేస్తామన్నారు.
2,379 దుకాణాలకు రేషన్ సరఫరా..
కార్డుదారులకు ఈనెల 16నుంచి అందజేయనున్న కేంద్ర ప్రభుత్వ అదనపు కోటాకు సంబంధించి ఇప్పటివరకు 2,379 చౌకధరల దుకాణాలకు సుమారు 13వేల టన్నుల బియ్యం సరఫరా చేశామని మంజుభార్గవి తెలిపారు. మొత్తం 625 దుకాణాలకు 200 టన్నుల శనగలు సరఫరా చేశారు. 1,113 టన్నుల శనగలు అవసరమని, ఇప్పటికి 1,080 టన్నుల మేర జిల్లాకు చేరాయన్నారు. ఈ నెల 15వ తేదీ లోపు పూర్తిస్థాయిలో దుకాణాలకు బియ్యం, శనగల సరఫరాకు చర్యలు చేపట్టామని ఆమె తెలిపారు.
ఇదీ చూడండి..