ఎస్సీ సంఘాలు చేపట్టిన చలో మదనపల్లె కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు నేతలను గృహ నిర్బంధం చేశారు. పోలీసుల తీరుతో నేతలు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్రయ్యను పరామర్శించేందుకు తిరుపతి చేరుకున్న న్యాయవాది శ్రవణ్‌కుమార్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఆయన బస చేసిన హోటల్ నుంచి బయటకు రానీయకుండా నిలువరించారు. నిర్బంధాన్ని ఖండించిన శ్రవణ్‌కుమార్... హోటల్ గదిలోనే నిరసనకు దిగారు. ప్రభుత్వానివి ప్రజావ్యతిరేక చర్యలనీ... దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
న్యాయవాది శ్రవణ్‌కుమార్ నిర్బంధాన్ని నిరసిస్తూ.. ఎస్సీ సంఘాలు, ప్రజా సంఘాల నేతలు ఆయన బస చేసిన హోటల్ ఎదుట ఆందోళకు దిగారు. శ్రవణ్‌కుమార్‌ను వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు. బస్టాండ్ కూడలిలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. గాంధీ జయంతి రోజున ప్రజాస్వామ్య హక్కులను కాలరాసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్నాకు దిగిన నేతలను పోలీసులు అరెస్ట్ చేసి తిరుచానూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
తిరుపతిలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు... ఇతర ప్రాంతాల నుంచి నిరసనలో పాల్గొనేందుకు వచ్చే నాయకులను మధ్యలోనే అడ్డుకున్నారు. మదనపల్లెలో 600 మంది పోలీసులతో ప్రధాన కూడళ్లలో పికెట్ ఏర్పాటు చేశారు. ఐదుగురు డీఎస్పీలు, 19 మంది సీఐలు, 16 మంది ఎస్ఐలతో భద్రతను పర్యవేక్షించారు. బీఎస్పీ నేతలు సబ్‌కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా... పోలీసులు అడ్డుకున్నారు.
మదనపల్లెలో అరెస్టు చేసిన ఎస్సీ సంఘాల నేతలను పోలీసులు విడుదల చేయడంతో ఆందోళనను విరమించారు. అనంతరం సబ్ కలెక్టర్ జాహ్నవికి... ఎస్సీ, ఎస్టీ సంఘాల నేతలు వినతిపత్రం అందించారు.
ఇదీచదవండి