గుర్తింపు కోల్పోయిన చిత్తూరు జిల్లా ఆర్‌వీఎస్ కళాశాలలో చదివిన విద్యార్థులకు మంచిరోజులొచ్చాయి. కోర్టు తీర్పు మేరకు 10 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 150మంది విద్యార్థులను సర్దుబాటు చేసేలా అధికారులు ఏర్పాటు చేశారు.
నిరీక్షణ ఫలించిందని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు మంచి వైద్య విద్య అభ్యసించే అవకాశం దొరికిందని కన్నవారు ఆనందిస్తున్నారు. 150 మంది ఈ కౌన్సెలింగ్‌లో కళాశాల ఎంచుకొని మూడో సంవత్సరం నుంచి వైద్య విద్య కొనసాగిస్తారు.
2016లో ఎంసెట్ రాసిన ఈ 150 మంది విద్యార్థులు... చిత్తూరు జిల్లాలోని ఆర్‌వీఎస్ కళాశాలలో చేరారు. వైద్యులమవుతున్నామనే ఆనందం కొన్ని నెలలకే ఆవిరైంది. అధ్యాపకులు... ప్రయోగశాలలు, కనీస వతసుల్లేవన్న ఫిర్యాదుతో ప్రవేశాలు నిలిపేసింది కళాశాలపై మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఈ నిర్ణయంతో 150 మంది భవిష్యత్ సందిగ్ధంలో పడింది. మూడేళ్లుగా పోరాడిన విద్యార్థుల శ్రమ ఫలిచింది. వేరే కళాశాలల్లో చేర్పించాలని న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ మేరకు వాళ్లంతా వేర్వేరు కళాశాల్లో చేరి మూడో సంవత్సరం కొనసాగించనున్నారు.