RAMOJI FOUNDATION : తెలుగు రాష్ట్రాల్లో పలు గ్రామాల దత్తతతో పాటు వివిధ సామాజిక కార్యక్రమాలు చేస్తున్న రామోజీ ఫౌండేషన్ మరోసారి తన మార్క్‌ను చూపించింది. చిత్తూరు జిల్లా పుంగనూరులోని తెలుగుతల్లి వృద్ధాశ్రమానికి రూ.20 లక్షల గృహోపకరణాలు, ఇతర సామగ్రిని వితరణగా అందజేసింది. రెండు గదులను బాగుచేసి టైల్స్‌తో తీర్చిదిద్దింది. ఆశ్రమానికి అవసరమైన మంచాలు, పరుపులు, వాటర్‌ఫిల్టర్, ఫ్రిజ్, వాషింగ్‌మిషన్, నీటిని తోడే మోటారు, ఇన్వర్టర్లు, కుర్చీలు, డైనింగ్ టేబుళ్లు, దుప్పట్లు, భోజనం ప్లేట్లు, గ్లాసులు, బీరువాలు, టీవీ, ఇతర పరికరాలను ఆశ్రమ నిర్వాహకులు రేవతి, నటరాజకు ‘ఈనాడు’ తిరుపతి యూనిట్ ఇన్‌ఛార్జి బి.చంద్రశేఖర్ అందజేశారు.
‘ఈనాడు-ఈటీవీ’ సంస్థల అధినేత రామోజీరావు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ‘రామోజీ ఫౌండేషన్’ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తిరుపతి యూనిట్ ఇంఛార్జ్ చంద్రశేఖర్ వివరించారు. అనంతరం స్టోర్ రూంను విశ్రాంత వైద్యాధికారి, రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షురాలు డాక్టర్ విజయకుమారి ప్రారంభించారు. రామోజీ ఫౌండేషన్ సేవలను వక్తలు కొనియాడారు. ఆశ్రమ నిర్వాహకులు రేవతి, నటరాజలను.. పలువురు అభినందించారు. ఆశ్రమంలో ఫౌండేషన్ ద్వారా మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు.
ఇవీ చదవండి: