చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురంలో రైతుల కోసం నిర్వహించిన 'రైతు కోసం తెదేపా' కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. శాంతిపురంలోని తెదేపా కార్యాలయం నుంచి జాతీయ రహదారి మీదుగా బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. పార్టీ నాయకులు కార్యకర్తలు ట్రాక్టర్లు, ఎడ్లబండ్ల ద్వారా కార్యక్రమానికి హాజరయ్యారు. బస్టాండ్ కూడలిలో జరిగిన నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి అమరనాథ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గౌరవ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. దాదాపు గంటసేపు జరిగిన నిరసన కార్యక్రమంలో వైకాపా ప్రభుత్వ అసమర్థ పాలన, రైతులకు జరుగుతున్న అన్యాయాలను ఎండగట్టారు. వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదే సందర్భంలో అక్కడికి వైకాపా నాయకులు, కార్యకర్తలు చేరుకొని వైఎస్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా తెదేపా, వైకాపా కార్యకర్తలు పరస్పరం నినాదాలు చేయటం ఉద్రిక్తతకు దారి తీసింది. ఓ దశలో ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు బాహాబాహీకి ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకోవడం కష్ట సాధ్యమైంది.
పూతలపట్టులో...
పూతలపట్టు మండలంలో తెదేపా నాయకులు గురువారం రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమాన్ని చేపట్టారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా కేంద్రాల్లో ముళ్ళ చెట్లు మొలచి సిబ్బందికి పనిలేకుండా ఉన్నారని ఆరోపించారు. ఆరుగాలం శ్రమించి రైతులను దగా చేసిన ముఖ్యమంత్రి వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేశారు.
చంద్రగిరిలో...
చంద్రగిరి నాలుగు రోడ్ల కూడలి వద్ద 'రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమాన్ని' ఆ పార్టీ నాయకులు నిర్వహించారు. అదే సమయంలో అక్కడకు వైకాపా నాయకులు చేరుకున్నారు. నిరసన కార్యక్రమాన్ని భగ్నం చేయడానికి వచ్చినట్టుగా భావించిన తెదేపా కార్యకర్తలు సీఎం, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. చంద్రగిరి పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని ఇరువర్గాల వారికి సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.
నగరిలో..
నగరి నియోజకవర్గం నిండ్రలో గాలి భానుప్రకాష్ అధ్యక్షతన తెదేపా శ్రేణులు నిరసనలు చేపట్టారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి స్థానిక తహసీల్దారు కార్యాలయం ఎదుట నిరసన గళాన్ని వినిపించారు. ఈ సందర్భంగా గాలి భానుప్రకాష్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ గాలికి వదిలేసిన పరిస్థితి నెలకొందని ఆరోపించారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేసి చూపిస్తామని ఇచ్చిన మాట ఏమైందని ప్రశ్నించారు.
పీలేరులో...
పీలేరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమం విజయవంతమైంది. పీలేరు నియోజకవర్గ పరిధిలోని తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్లు, ఆరు మండలాల పరిధిలోని రైతులతో కలిసి నిరసన ర్యాలీ చేపట్టారు.