Local Leader Complained to Central Minister Amit Shah: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన స్థానిక నేత బోడె రామచంద్ర యాదవ్.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి ఫిర్యాదు చేశారు. పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజ్యాంగమే నడుస్తోందని, గత నెలలో పెద్దిరెడ్డి అనుచరులు తనపై, తన ఇంటిపై దాడి చేసి.. తన కుటుంబాన్ని హతమార్చే ప్రయత్నం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎవరిపైనా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అనంతరం బోడె రామచంద్ర యాదవ్.. తనకు, తన కుటుంబానికి భద్రత కల్పించాలని, అలాగే తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి అమిత్ షాను కోరారు. దాంతో ఆయన.. దాడి గురించి అన్ని వివరాలను తెలుసుకొని, విచారణ జరిపి, దాడి చేసిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామన్నామని, భద్రత కూడా కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు రామచంద్ర యాదవ్ తెలిపారు.
‘‘గత నెలలో మంత్రి పెద్దిరెడ్డి తన అనుచరులతో దాడి చేయించారు. ఇప్పటి వరకు పోలీసులు ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. మంత్రి పెద్దిరెడ్డిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి. రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగానికి బదులు.. జగన్ మోహన్ రెడ్డి రాజ్యాంగం నడుస్తోంది. దాడి గురించి అమిత్ షా అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. విచారణ జరిపి దాడి చేసిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. నాకు భద్రత కల్పిస్తామని హోం మంత్రి హామీ ఇచ్చారు. 2019లో పుంగనూరు నుంచి పోటీ చేశా.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాపై దాడి చేశారు. గత నెల 4న రైతు బేరి, రైతులపై చేస్తున్న దాడులపై చర్చించేందుకు సమావేశం పెట్టుకున్నాం. ఆ మీటింగ్ జరగకుండా అడ్డుకున్నారు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా.. సభ పెట్టుకోనివ్వలేదు. పుంగనూరులో పెద్దిరెడ్డి రాజ్యాంగం నడుస్తోంది. నా ఇంటిపై దాడి చేసి నా కుటుంబాన్ని హతమార్చే ప్రయత్నం చేశారు..దీనికి పోలీసు వ్యవస్థ కూడా కారణమే’’- రామచంద్ర యాదవ్, స్థానిక నేత
ఇవీ చదవండి