Poultry Giant Sundaranaidu Jayanthi Sabha: పౌల్ట్రీ, సమాజ సేవ డాక్టర్ సుందరనాయుడికి రెండు కళ్లని పౌల్ట్రీ రైతులు కొనియాడారు. రాయలసీమలో కోళ్ల పరిశ్రమ ప్రగతికి ఆయన ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కేంద్రంలోని నెక్ జోనల్ కార్యాలయంలో చిత్తూరు పౌల్ట్రీ సమాఖ్య, ఆంధ్రప్రదేశ్ పౌల్ట్రీ సమాఖ్య, నెక్ ఆధ్వర్యంలో శనివారం పౌల్ట్రీ దిగ్గజం సుందరనాయుడి 87వ జయంతి నిర్వహించి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన కుమార్తె, బాలాజీ హేచరీస్ ఎండీ నీరజ, బాలాజీ హేచరీస్ డైరెక్టర్ ప్రణీత్, నెక్ జోనల్ ఛైర్మన్ రమేష్‌బాబు, కోళ్ల రైతులు పాల్గొన్నారు.
పౌల్ట్రీ రంగానికి సుందరనాయుడు చేసిన సేవలను స్మరించుకున్నారు. చిత్తూరు నగరాభివృద్ధికి ఆయన తోడ్పాటు అందించారన్నారు. కోళ్ల పరిశ్రమ ఉన్నంత కాలం సుందరనాయుడి జయంతి, వర్ధంతి నిర్వహించాలని సమావేశంలో తీర్మానించారు. రాయలసీమలో వరుసగా కరవు కాటకాలతో అన్నదాతలు నష్టాల్లో కూరుకుపోయిన తరుణంలో పౌల్ట్రీ ద్వారా సుందరనాయుడు రైతులకు చేయూతను అందించారని ప్రణీత్ తెలిపారు. పశు వైద్యుడిగా పని చేసిన సమయంలో గ్రామాలకు వెళ్లి వైద్యం అందించారని చెప్పారు.
అన్నదాతల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపరిచేందుకు తాను కోళ్ల ఫారం నెలకొల్పడంతోపాటు లక్షల మందిని ఆ రంగం వైపు మళ్లించారని తెలిపారు. ఆయన కారణంగా ఎంతోమంది కర్షకుల పిల్లలు ఉన్నత చదువులు చదివి దేశ, విదేశాల్లో స్థిరపడ్డారన్నారు. నెక్ జోనల్ ఛైర్మన్, రెడ్‌క్రాస్ గౌరవ ఛైర్మన్ రమేష్‌బాబు మాట్లాడుతూ.. సుందరనాయుడి జ్ఞాపకార్థం పౌల్ట్రీ రైతుల కోసం ప్రత్యేకంగా భవనం నిర్మిస్తామన్నారు. అందులో వ్యాధుల నిర్ధారణ, కోళ్ల మేత, ఔషధాల నాణ్యత పరిశోధనశాల ఏర్పాటు చేస్తామని తెలిపారు. మూగ జీవాలంటే సుందరనాయుడికి ఎనలేని ప్రేమని నెక్ జోనల్ మాజీ ఛైర్మన్ మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. పౌల్ట్రీ రంగానికి కష్టాలు వచ్చిన ప్రతిసారీ ఆయన పెద్దదిక్కుగా వ్యవహరించి వాటినుంచి రైతులను గట్టెక్కించారన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.ఈశ్వరరావు, సి.జగదీష్, జానకిరామ్, తుకారాం, బాలాజీ హేచరీస్ మేనేజర్ రాజేంద్ర, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
రక్తదాన శిబిరం..
సమావేశం అనంతరం నెక్ జోనల్ కార్యాలయంలో రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. సుందరనాయుడి మనవడు, బాలాజీ హేచరీస్ డైరెక్టర్ ప్రణీత్‌తో పాటు పలువురు రక్తదానం చేశారు.
"వెనుకబడిన రాయలసీమలోని రైతులతో కోళ్ల పరిశ్రమలు ఏర్పాటు చేయించడం ద్వారా సుందర నాయుడు ఇక్కడి ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించారు. వలసలను కొంతైనా అరికట్టేందుకు ఈ రంగం తోడ్పాటునిచ్చింది. తమిళనాడులోనూ పౌల్ట్రీ పరిశ్రమ విస్తరణకు కృషి చేశారు. ఈ రంగానికి ఆయన చేసిన సేవలు మరువలేనివి. చిత్తూరు నగరాభివృద్ధికి కృషి చేశారు. అరుదైన ఎర్రచందనం పరిరక్షణకు చిత్తూరులో నగరవనం చుట్టూ కంచె నిర్మించారు. స్వగ్రామమైన తవణంపల్లె మండలం కంపలపల్లెలో జన్మభూమి కార్యక్రమంలో భాగంగా సొంత నిధులు వెచ్చించి ఎంపీడీవో కార్యాలయ భవనం నిర్మించారు. శ్రమదానం పేరుతో అందరి సహకారంతో టి.పుత్తూరు నుంచి కంపలపల్లెకు రోడ్డు ఏర్పాటు చేయించారు." - హేమాద్రి, పౌల్ట్రీ రైతు
"సుందరనాయుడితో 1984 నుంచి నాకు అనుబంధం ఉంది. పౌల్ట్రీ రైతులకు సూచనలు, సలహాలు అందించేందుకు ఆయన పల్లెపల్లెకూ వెళ్లేవారు. కర్షకుల బాగు కోసం నిరంతరం పరితపించారు. చిత్తూరు జిల్లాలో మొక్కజొన్న పంట విస్తరణను పెంచి అటు కోళ్ల పరిశ్రమకు, ఇటు రైతులకు మేలు చేశారు. ఆయన అందించిన సేవలను గుర్తించి న్యూజెర్సీ ప్రభుత్వం ‘డూయర్ ఆఫ్ ది పౌల్ట్రీ ఇన్ సౌత్ ఇండియా’ పురస్కారం అందజేసింది." - బీ.శ్రీనివాసులు నాయుడు, పౌల్ట్రీ రైతు
"చిత్తూరు జిల్లాలో రెడ్‌క్రాస్ తరఫున రక్తనిధి కేంద్రం ఏర్పాటు చేయడంలో సుందరనాయుడు చొరవ చూపారు. 2002లో దిల్లీ వెళ్లి రక్తనిధి కేంద్రం లైసెన్సు తీసుకువచ్చి అప్పటి గవర్నర్ రంగరాజన్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయించారు. రెడ్‌క్రాస్ సేవలు ప్రతి ఒక్కరికీ అందాలని ఆయన పరితపించారు. కష్టాల్లో ఉన్నవారికి సేవ చేయడమే తన లక్ష్యమని భావించేవారు." - రఘుపతి, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా కార్యదర్శి