లీటరు పెట్రోలు ధర చిత్తూరు జిల్లా కుప్పంలో రూ.110కి చేరింది. రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడే ఎక్కువగా ఉంది. నిజానికి సబ్బులు, ఇతర నిత్యావసరాల ధరలు అన్నిచోట్లా ఒక్కటే ఉంటాయి. లీటరు పెట్రోలు ధర మాత్రం విశాఖపట్నంలో 106.80, విజయవాడలో రూ.107.63 ఉంటే కుప్పంలో మాత్రం రూ.110 చొప్పున విక్రయిస్తున్నారు. విశాఖపట్నంతో పోలిస్తే కుప్పంలో డీజిల్ మూడు రూపాయలు ఎక్కువగా ఉంది. శ్రీకాకుళం జిల్లా కంచిలిలో లీటరు పెట్రోలు రూ.108.92, డీజిల్ రూ.100.39 చొప్పున ఉంది. అక్కడికి.. విశాఖకు పెట్రోలుపై లీటరుకు రూ.2.12 తేడా ఉంది. నిల్వ కేంద్రాల నుంచి దూరానికి అనుగుణంగా అయ్యే రవాణాఛార్జీలే ఈ తేడాకు కారణమని ఇంధన సంస్థలు చెబుతున్నాయి. నెల్లూరు జిల్లా తడ నుంచి చిత్తూరు జిల్లా కుప్పం వరకు దూరాన్ని లెక్కిస్తున్నారు. ఒక్క పెట్రోలుపైనే కాదు.. డీజిల్, వంటగ్యాస్‌కూ ఇలాగే వడ్డనలు ఉంటున్నాయి. పన్నుల రూపంలో ప్రభుత్వాల బాదుడుకు తోడు రవాణా రూపంలో పడే భారానికీ వినియోగదారులే బాధితులవుతున్నారు.
ఒకే నగరంలో వేర్వేరు ధరలు
గుంటూరు జిల్లా తాడేపల్లికి, పక్కనే ఉండే విజయవాడకు మధ్య పెట్రోలుపై లీటరుకు 10పైసల నుంచి 20 పైసల వరకు (ఇంధన సంస్థలకు అనుగుణంగా) తేడా కన్పిస్తోంది. అంతెందుకు? విజయవాడ భవానీపురంలో ఉండే ధరకు, బెంజి సర్కిల్‌లో ఉండే ధరకు మధ్య లీటరుకు 20 పైసల వరకు తేడా ఉంటోంది. డీజిల్‌పైనా ఇలాగే వ్యత్యాసం కన్పిస్తోంది. భవానీపురం బంకులకు సమీపంలోని నిల్వ కేంద్రాల నుంచి ఇంధనం సరఫరా అవుతోంది.
వంటగ్యాస్‌పై మరింతగా..
పెట్రోలు ధరల్లో తేడా రూపాయల్లో ఉంటే వంటగ్యాస్‌కు వచ్చేసరికి పదుల్లోనే పెరుగుతోంది. 14.2 కిలోల సిలిండర్ విశాఖపట్నంలో రూ.841 ఉంటే.. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో రూ.904 చొప్పున విక్రయిస్తున్నారు. విజయవాడ, విశాఖపట్నంలలోనూ సిలిండర్ ధరలో వ్యత్యాసం రూ.25 వరకుంది. అయితే దూరానికి అనుగుణంగా రాయితీనిస్తున్నారు. విశాఖపట్నంలో రూ.4 చొప్పున వస్తుంటే, ఉరవకొండ ప్రాంతంలో రూ.40 వరకు జమవుతోంది.
ఇదీ చూడండి. Third wave : నిర్లక్ష్యానికి భారీ మూల్యం తప్పదా..!