చిత్తూరు జిల్లాను భౌగోళికంగా రెండు భాగాలుగా విభజిస్తే తూర్పు మండలాలైన శ్రీకాళహస్తి, సత్యవేడు, బీఎన్ కండ్రిగ, ఏర్పేడు మండలాలు తెలుగుగంగ ప్రాజెక్టుతో తాగు, సాగు నీరు పుష్కలంగా లభిస్తుండటంతో పంటలన్నీ సస్యశ్యామలంగా దర్శనమిస్తున్నాయి. పడమటి మండలాలైన తిరుపతి గ్రామీణం, పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె, పలమనేరు హంద్రీనీవా, నగరి గాలేరు ప్రాజెక్టుల పనులు నిలిచిపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సుమారు 42 లక్షల జనాభా ఉన్న జిల్లాలో అధిక ప్రాంతాల్లో వారం రోజులకు ఓ సారి మాత్రమే నీరు లభ్యమవుతోంది. తాగు నీటి అవసరాలు తీర్చే తెలుగు గంగ కాలువ, కైలాసగిరి రిజర్వాయర్, కల్యాణి డ్యాం, చిప్పిలి జలాశయం, ఎన్టీఆర్ జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటాయి. పురపాలక సంస్థ ట్యాంకర్లతో పాటు అదనంగా, ప్రైవేట్ బోర్ల నుంచి నీటిని సేకరించి ప్రజలకు అందించే ఏర్పాట్లను చిత్తూరు, మదనపల్లె పురపాలక సంస్థలు చేశాయి.
తిరుపతి నగరంలోనే సుమారు నాలుగు లక్షల జనాభా నివసిస్తుండగా.. మరో లక్ష మంది యాత్రికుల రూపంలో రాకపోకలు సాగిస్తూ ఉంటారు. వీరందిరికీ తిరుపతి నగరపాలక సంస్థ తాగునీటిని అందిస్తోంది. కల్యాణి డ్యాం, కైలాస గిరిలో సరైన నీటి నిల్వలు లేక, నగరంలో నాలుగైదు రోజులకు ఒక్కసారే కుళాయిల ద్వారా నీరు సరఫరా అవుతోంది. ఫలితంగా స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. జిల్లాలో వర్షాభావ పరిస్థితుల కారణంగా 2,677 గ్రామాల్లో తాగునీటి సమస్య నెలకొందని అధికారులు చెబుతున్నారు. జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 2,308 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా, 367 గ్రామాలకు వ్యవసాయ బోర్ల అనుసంధానం ద్వారా నీటిని అందించి తాగునీటి దాహార్తిని తీరుస్తున్నారు. చిత్తూరు రెవెన్యూ డివిజన్ పరిధిలో 1,124 గ్రామాలకు, మదనపల్లె రెవెన్యూ డివిజన్ పరిధిలో 1,314 గ్రామాలకు, తిరుపతి డివిజన్ పరిధిలో 214 గ్రామాలకు తాగు నీటి సరఫరాను చేపట్టేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. కడపజిల్లా గండికోట రిజర్వాయర్ నుంచి పైపు లైన్ల ద్వారా 2,600 కోట్ల నిధులతో నీళ్లు రప్పించే ప్రయత్నాలు తుదిదశకు చేరుకున్నాయి. వీలైనంత త్వరగా తమ తాగునీటి సమస్యలను తీర్చి ఆదుకోవాలని జిల్లా వాసులు కోరుతున్నారు.
ఇదీచదవండి.