దశాబ్ధాల నుంచి ఆనవాయితీగా సాగుతున్న పశువుల పండగను చిత్తూరు జిల్లా వాసులు ఈ ఏడాది పోలీసుల ఆంక్షల నడుమ ఘనంగా నిర్వహించుకున్నారు. సంక్రాంతి పర్వదినాలైన చివరి రోజు కనుమ పండగ రోజున పశువులను అందంగా అలంకరించి...కొమ్ములకు ప్రత్యేకంగా తయారు చేసిన చెక్కపలకలు కట్టి వీధుల్లో వదిలారు. పశువులకు కట్టిన పలకలను దక్కించుకునేందుకు యువకులు పోటీపడటం...పశువులు బెదిరి పారిపోవడం వంటి వాటితో పశువుల పండగ ఆసక్తికరంగా సాగింది. పశువుల పండగను తిలకించడానికి జిల్లా నలుమూల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. పశు మందల పరుగులు, యువకులు వెంటపడటాన్ని తిలకించడానికి వీధుల పొడవునా ప్రజలు బారులు తీరారు. ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉత్సాహభరితంగా పశువుల పండగ సాగింది.
రంగంపేటతో పాటు పుల్లయ్యగారిపల్లె, కొత్తశానంబట్ల, అనుప్పల్లి గ్రామాలలో పశువుల పండుగను పెద్ద ఎత్తున నిర్వహించారు. ఆంక్షలు ఉన్నా ఇది తమకు పశువులపైన ఉన్న ప్రేమను వ్యక్తపరిచే పండుగనీ.. అందుకే ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని గ్రామస్థులు తెలిపారు. పశువులను అదుపు చేసే ప్రయత్నంలో కొంతమంది గాయపడినా.. వాటిని లెక్క చేయకుండా కొమ్ములకు కట్టిన చెక్కపలకలను సొంతం చేసుకొనేందుకు యువకులు పోటీపడ్డారు.
యువతను ఉత్సాహపరచడం...పశువులకు ఆటవిడుపుగా నిర్వహిస్తున్న పండగను చూసేందుకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి సైతం యువకులు భారీగా తరలివచ్చారు. కిక్కిరిసిన జనాల మధ్య పరుగులు పెట్టే పశువులను చూడటం కొత్త అనుభూతిని కలిగించిందని...ఎంతో ఆనందంగా ఉందని పశువుల పండగకు వచ్చిన వారు తెలిపారు. పశువుల పండుగను చూసేందుకు నగరి ఎమ్మెల్యే రోజా కుటుంబ సభ్యులతో సైతం వచ్చారు.
పశువులతో తమకున్న అవినాభావ సంబంధానికి ప్రతీకగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తామని రైతులు తెలిపారు. హింసకు తావు లేకుండా కేవలం పశువులను ఉల్లాసపరించేందుకే ఈ పండుగ జరుపుకొంటున్నామన్నారు.
ఇదీ చదవండి: తిరుమల శ్రీవారికి గోదాదేవి పూలమాలల అలంకరణ