Opponents sets Fire to farm fields: చిత్తూరు జిల్లా కురబలకోట మండలం దిగువశితివారిపల్లిలో.. తెదేపా నేతల పొలాలకు కొందరు నిప్పుపెట్టిన ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కురబలకోట మాజీ మండల అధ్యక్షుడు, తెలుగుదేశం నేత భూమిరెడ్డి, ఆయన తమ్ముడు చంద్రశేఖర్‌రెడ్డి పొలాలకు దుండగులు నిప్పు పెట్టగా తగలబడిపోయాయి. మంటల్లో టమోటా పంటకు ఆసరాగా పెట్టే కర్రలతో పాటు.. బిందుసేద్యం పరికరాలు దగ్ధమయ్యాయి.
విద్యుత్ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవడంతో తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లిందని బాధితులు వాపోయారు. సర్పంచ్ ఎన్నికల్లో తమ వర్గానికి చెందిన వ్యక్తి గెలుపొందడంతో.. వైకాపా నేతలు కక్షగట్టి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని.. తెదేపా నేతలు ఆరోపించారు. వైకాపా నేత శంకర్‌రెడ్డే తమ పొలాలకు నిప్పుపెట్టాడని.. అధికార బలంతో.. బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అచ్చెన్నాయుడు ఆగ్రహం..
ఈ ఘటనపై స్పందించిన తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.. వైకాపా నేతలు ఫ్యాక్షన్ దాహంతో పచ్చని పొలాలనూ వదలట్లేదని.. మండిపడ్డారు. జగన్ తన ఫ్యాక్షన్ సంస్కృతిని రాష్ట్రమంతా ఎక్కిస్తున్నారని దుయ్యబట్టారు. రాజకీయంగా ఎదుర్కోలేక.. దొంగ దెబ్బ తీయడం సిగ్గుచేటంటూ విమర్శించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులకు పార్టీ అండగా ఉంటుందని అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు.
ఇదీ చదవండి:
ఆర్బీకేల ద్వారా రైతులకు కొరవడిన భరోసా.. నామమాత్రంగానే విత్తనాలు, ఎరువుల విక్రయాలు