సరిహద్దు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక నుంచి అధిక సంఖ్యలో ప్రజలు చిత్తూరు జిల్లాకు వస్తుండటంతో భారీగా కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. తిరుపతి, నగరి, పుత్తూరు, చిత్తూరు, శ్రీకాళహస్తి, తిరుపతి గ్రామీణ ప్రాంతాలతో పాటు పడమటి మండలాల్లోనూ కేసుల సంఖ్య అధికంగా ఉంటోంది. తిరుపతి నగరంలో రోజూ 100కి పైగా కేసులు నమోదవుతున్నాయి. ఫలితంగా అప్రమత్తమైన అధికారులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 20కు పైబడి పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటిస్తున్నారు. తిరుపతి నగరంలో దాదాపు 18 డివిజన్‌లలో లాక్ డౌన్ విధించారు. తిరుపతి గ్రామీణ పరిధిలోని తిరుచానూరు, ఆవిలాల, శెట్టిపల్లె, పద్మావతిపురం గ్రామ పంచాయతీల్లోనూ లాక్డౌన్ను అమలు చేస్తూ.. కలెక్టర్ భరత్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా ప్రదేశాల్లో ఉదయం ఏడు గంటల నుంచి పదకొండు గంటల వరకు మాత్రమే నిత్యావసరాల కొనుగోలుకు అనుమతిస్తున్నారు.
3500 పడకలు సిద్ధం
వైరస్ సోకిన నగర వాసులకు వైద్యసేవలు అందించడానికి తితిదే పరిధిలోని శ్రీనివాసం వసతి సముదాయాన్ని ఉపయోగిస్తున్నారు. జిల్లాలోని ఇతర ప్రాంతాల కరోనా రోగుల కోసం పద్మావతి నిలయం, వికృతమాల కొవిడ్ కేర్ సెంటర్ల ద్వారా చికిత్స అందిస్తున్నారు. తిరుపతిలోని రుయా, స్విమ్స్ కొవిడ్ ఆసుపత్రి, చిత్తూరు జిల్లా కొవిడ్ ఆసుపత్రులతో పాటు పద్మావతి నిలయం, శ్రీనివాసం, వికృతమాల కోవిడ్ కేర్ సెంటర్లలో 3500 పడకలను సిద్ధం చేశారు.
మారుమూల ప్రాంతాల కోసం సంజీవని బస్సులు
జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 3,331 పాజిటివ్ కేసులు నమోదవగా.. ఈ మహమ్మారికి చిక్కి 33 మంది ప్రాణాలు కోల్పోయారు. మంగళం డిపోకు చెందిన ఇంద్ర బస్సులను... సంజీవని బస్సులుగా మార్చిన అధికారులు.... అనుమానితుల నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో అధికంగా కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో వీటిని ఉపయోగిస్తామని అధికారులు చెబుతున్నారు. ఎక్కువ మందికి టెస్ట్లు నిర్వహించటం ద్వారా... వైరస్ వ్యాప్తిని తగ్గించవచ్చని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీచదవండి.