చిత్తూరు జిల్లాలోని పలమనేరులో నమోదైన మూడు కరోనా పాజిటివ్ కేసుల మినహా మిగిలిన కేసులన్నీ జిల్లాలోని తూర్పు ప్రాంతంలోనే నమోదయ్యాయి. సోమవారం వరకు జిల్లా మొత్తం మీద 23 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. వీటిలో శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన ఒకరిని ఐసోలేషన్ కేంద్రం నుంచి ఇటీవల డిశ్చార్జి చేయడంతో ప్రస్తుతం 22 యాక్టివ్ కేసులున్నాయి. వీటిలో నాలుగు కేసులు మినహా మిగిలినవన్నీ నిజాముద్దీన్ మర్కజ్‌తో సంబంధమున్నవే. తూర్పు ప్రాంతంలోని తిరుపతి 6, నగరి 4, శ్రీకాళహస్తి 5, రేణిగుంట 2, ఏర్పేడు, నిండ్ర, వడమాలపేటల్లో ఒక్కోటి చొప్పున పాజిటివ్ కేసులొచ్చాయి. జమాత్‌కు తూర్పు మండలాల నుంచి దిల్లీకి, పడమటి ప్రాంతాల నుంచి బెంగళూరుకు వెళ్తుంటారు. దీంతో తూర్పు మండలాల్లోనే కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు అంచనా వేస్తున్నారు. జిల్లా మొత్తం మీద 221 స్వాబ్స్ శాంపిళ్ల ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది.
బయటపడిందిలా..
శ్రీకాళహస్తికి చెందిన వ్యక్తి దిల్లీలో జరిగిన మతపరమైన కార్యక్రమానికి హాజరై వచ్చాడు. అతనికి పరీక్షలు చేయగా.. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అతని కుటుంబ సభ్యులతో పాటు, సోదరుడి కుటుంబాన్ని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. వీరి స్వాబ్స్ పరీక్షలకు పంపగా, అతని సోదరుడి భార్యతో పాటు ఆమె తొమ్మిదేళ్ల కుమార్తెకు తాజాగా కరోనా ఉన్నట్లు తేలింది. వీరిద్దరినీ చిత్తూరులోని కొవిడ్ ఆస్పత్రి ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. కొద్ది రోజులుగా వీరంతా క్వారంటైన్ కేంద్రంలో ఉండటంతో ఇప్పుడు అక్కడున్న వారికి పరీక్షలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 13 మందికి వెంటనే స్వాబ్స్ స్వీకరించి పరీక్షలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
నెలాఖరు వరకు లాక్‌డౌన్
జిల్లా పాలనాధికారి భరత్‌గుప్తా సోమవారం శ్రీకాళహస్తిలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్‌లో పలు ప్రాంతాల్లో వెసులుబాటు కల్పించినా, ఈనెల 28 వరకు శ్రీకాళహస్తిలో విధిగా పాటించాలని ఆదేశించారు. ప్రజలు సహకరించకుంటే రెడ్‌జోన్ నిబంధనలు పట్టణమంతా పెంచుకుంటూ వెళ్తామన్నారు. మరోవైపు కుప్పం నుంచి 20 మందితో కూడిన ప్రత్యేక వైద్యబృందాలు శ్రీకాళహస్తికి చేరుకున్నాయి. వీరు కరోనా నేపథ్యంపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు అనారోగ్య పీడితులకు సేవలందిస్తారు. పారిశుద్ధ్యాన్ని పర్యవేక్షిస్తారు.
5750 ఇళ్ల పరిధిలో నిషేధాజ్ఞలు
శ్రీకాళహస్తిలో సోమవారం ఇద్దరికి పాజిటివ్ రావడంతో వారు ఉంటున్న ఇంటికి 3 కి.మీల పరిధిలోని 19,120 ఇళ్లలో మళ్లీ ఇంటింటి సర్వే నిర్వహించారు. 39 మందికి ఆరోగ్య సమస్య ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఓ వైద్యుడిని వారికి ఇంటికే పంపి, కరోనా లక్షణాలు కనిపిస్తే క్వారంటైన్లకు తరలించనున్నారు. స్వాబ్స్ స్వీకరించి పరీక్షలు నిర్వహించనున్నట్లు తిరుపతి డివిజన్ ఆర్డీవో కనకనరసారెడ్డి ‘ఈనాడు’కు తెలిపారు. పట్టణంలోని 5750 ఇళ్ల పరిధిలో ఎవరూ వెలుపలికి, బయటి నుంచి లోపలికి రాకుండా నిషేధాజ్ఞలు విధించినట్లు తెలిపారు. వీరికి నిత్యావసరాలను వాలంటీర్ల ద్వారా పంపిస్తామన్నారు.
సహాయక శిబిరాల్లో 1,771 మంది
జిల్లాలోని 27 సహాయక శిబిరాల్లో ఇతర జిల్లాలవారు, రాష్ట్రేతరులు 1,771 మంది ఆశ్రయం పొందుతున్నారు. క్వారంటైన్ కేంద్రాల్లో సోమవారం కొత్తగా 26మంది చేరారని జేసీ-2, కొవిడ్-19 జిల్లా నోడల్ అధికారి చంద్రమౌళి తెలిపారు.
ఇదీ చదవండి: