ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఇవాళ తిరుమల రానున్నారు. నియామక గవర్నర్ వారి కుటుంబసభ్యులతో కలిసి భువనేశ్వర్ నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 10 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన తిరుమల వెళతారు. పద్మావతి వసతి గృహంలో కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 ద్వారా ఆలయానికి వెళ్ళి స్వామి వారిని దర్శించుకుంటారు.
తొలిసారిగా రాష్ట్రానికి...
తొలిసారి రాష్ట్రానికి వస్తున్న గవర్నర్‌కు ఘనస్వాగతం పలికేందుకు తితిదే అధికారులు ఏర్పాట్లు చేశారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 17వ నెంబర్ కంపార్ట్ మెంట్ నుంచి మహాద్వారం ద్వారా శ్రీవారి ఆలయానికి గవర్నర్ కుటుంబ సభ్యులు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 నుంచి 1.30 గంటల సమయంలో శ్రీవారి సేవలో పాల్గొంటారు. అనంతరం రంగనాయక మంటపానికి చేరుకుంటారు. ఆయనకు తితిదే అధికారులు స్వామి వారి శేషవస్త్రం, చిత్రపటంతోపాటు తీర్థప్రసాదాలు అందజేస్తారు. తర్వాత వేదపండితులు ఆశీర్వదిస్తారు.