చిత్తూరు జిల్లాలోని కుప్పం బ్రాంచి కాలువ.. ప్రస్తుతం ఇది ప్రధాన చర్చగా మారింది.. కుప్పం ప్రాంతంలో సాగు, తాగునీటి అవసరాలు తీర్చే ఈ కాలువ ఏళ్లుగా అసంపూర్తిగా ఉంది.. చివరి దశ పనులు నిలిచిపోయాయి.. కేవలం మూడు కి.మీల పరిధిలో పనులు పూర్తి చేస్తే ఆశయం నెరవేరుతుంది.. ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడం వల్ల పనులన్నీ నిలిచిపోయాయి. కాలువ పనులు పూర్తిచేయాలని కోరుతూ తెదేపా ఐదురోజుల కిందట పాదయాత్ర చేపట్టింది.. పోటీగా వైకాపా నేతలు యాత్రకు సిద్ధం కావడం.. పోలీసులు రెండు పార్టీల నేతలను అడ్డుకోవడం జరిగిపోయాయి.. కొన్నిచోట్ల ఉద్రిక్తతకు దారితీసింది.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించి ప్రభుత్వంపైనా.. అధికారుల పైనా విమర్శలు గుప్పించారు.
కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లోని 110 చెరువులను నింపడంతో పాటు 6300 ఎకరాలకు సాగు, 4.02 లక్షల మందికి తాగునీరు అందించేందుకు కుప్పం బ్రాంచి కాలువకు ప్రతిపాదన చేశారు. ఇందుకోసం 123.641 కి.మీల మేరకు కాలువ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. తొలుత 2016లో టెండర్లు పిలిచి రూ.430.26 కోట్లకు పనులు అప్పగించారు.దక్కించుకున్న గుత్తేదారులు వెంటనే పనులు ప్రారంభించారు. ఆ తర్వాత మరో రూ.122.75 కోట్లకు అదనంగా విలువ పెంచి రూ.553.01 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
ఆటంకాలు అధిగమించి..
కుప్పం బ్రాంచి కాలువ నిర్మాణంలో భాగంగా.. తొలుత 70 మీటర్ల ఎత్తులో పిల్లర్లను ఏర్పాటు చేసి నీటిని తరలించాలని భావించారు. ఇందుకు ఆరు ప్రాంతాలను గుర్తించారు. అది సాధ్యం కాదని భావించి 14 కి.మీల మేరకు పైప్లైన్లను ఏర్పాటు చేశారు. గుడిపల్లె ప్రాంతంలో కాలువ మార్గంలో క్వారీ రాళ్లు అడ్డురాగా అక్కడ టన్నెల్ నిర్మాణం చేపట్టారు. భూసేకరణ సమస్యలు ఏర్పడగా అధికారులు చర్యలు తీసుకుని పరిష్కరించారు.
ఎత్తిపోతల పనులు పూర్తి చేస్తేనే..
కుప్పం బ్రాంచి కాలువలో మూడుచోట్ల ఎత్తిపోతల పనులు చేపట్టారు. పెద్దపంజాణి మండలంలోని పశుపత్తూరు వద్దనే ఎత్తిపోతల పనులు పూర్తి చేయడంతో.. పెద్దపంజాణి, బైరెడ్డిపల్లె మండలాల్లో కాలువ ద్వారా హంద్రీ-నీవా జలాల ప్రవాహానికి మార్గం ఏర్పడింది. వి.కోట మండలంలోని క్రిష్ణాపురం వరకు నీటి రాకకు ఇబ్బంది లేదు. గత ఏడాది ట్రయల్రన్గా కృష్ణా జలాలు క్రిష్ణాపురం వరకు వచ్చాయి. అక్కడ ఎత్తిపోతల ముగింపు దశ పనులు ఆగిపోవడంతో నీరు ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది.
ఆదినేపల్లె వద్ద ఎత్తిపోతల నిర్మాణం 80 శాతం పూర్తయింది. మోటార్ల ఏర్పాటు, విద్యుత్తు ఉపకేంద్రం నిర్మాణం చివరి దశ పనులు పూర్తి కాలేదు. కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో 123 కిలోమీటర్ల కాలువ తవ్వకంలో కేవలం 2.2 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే మట్టి తవ్వకాన్ని చేపట్టాల్సి ఉంది. సిమెంటు నిర్మాణాలకు సంబంధించి.. 221 స్ట్రక్చర్లను నిర్మించారు. మిగతా 44 చోట్ల పనులు పూర్తి కాలేదు. క్రిష్ణాపురం, ఆదినేపల్లె ఎత్తిపోతల పనులను పూర్తి చేస్తేనే హంద్రీ- నీవా జలాలు కుప్పం నియోజకవర్గంలోకి చేరుతాయి.
ఏడాదిన్నరగా ఆగిన నిర్మాణాలు
బ్రాంచి కాలువ తవ్వకం పనులను సుమారు 20 మంది ఉప గుత్తేదారులకు అప్పగించారు. వారికి సకాలంలో బిల్లుల చెల్లించకపోవడంతో ఆశించిన మేరకు పనులు ముందుకు సాగలేదు. వి.కోట మండల పరిధిలోని క్రిష్ణాపురం నుంచి ఆదినేపల్లె వరకు సుమారు 11 కిలోమీటర్ల పరిధిలో మట్టి పనులు చాలాచోట్ల పూర్తి కాలేదు. రామకుప్పం, శాంతిపురం, కుప్పం, గుడుపల్లె మండలాల్లో పలుచోట్ల కాలువ తవ్వకాలు చేపట్టాల్సి ఉంది. కాలువపై అనేక ప్రాంతాల్లో వంతెనల నిర్మాణాలు అర్ధంతరంగా ఉన్నాయి. కాలువలో పైపులను ఏర్పాటు చేసిన చోట సిమెంటు నిర్మాణ ముగింపు దశ పనులు పూర్తికి నోచుకోలేదు. ఇప్పటివరకు సుమారు రూ.468 కోట్ల విలువైన పనులు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే 85 శాతం వరకు పనులు పూర్తి చేశామని మిగిలిన పనులకు సంబంధించి రూ.85 కోట్లను వెచ్చిస్తే కాలువ పూర్తవుతుందని అథికారులు చెబుతున్నారు.
ప్రభుత్వానికి నివేదించాం
కుప్పం బ్రాంచి కాలువ పూర్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పనులు చేసేందుకు గుత్తేదారు ముందుకు రావట్లేదు. ఇప్పటికే 80 శాతంపైనా పనులు పూర్తయ్యాయి. చిన్నచిన్న పనులే మిగిలి ఉన్నాయి. నిధులు ఇస్తేనే పనులు చేస్తామని గుత్తేదారు చెబుతున్నారు. చేసిన పనులకు సొమ్ము చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా గుత్తేదారు స్పందించట్లేదు. ఈ విషయమై ఇప్పటికే గుత్తేదారుకు నోటీసులు పంపించాం. ఇప్పటివరకు పూర్తయిన పనులు, ప్రస్తుత పరిస్థితులపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించాం. ప్రభుత్వ నిర్ణయం మేరకు పనులు చేపట్టి కాలువ నిర్మాణం పూర్తిచేస్తాం. - హరినారాయణరెడ్డి, సీఈ, హెచ్ఎన్ఎస్ఎస్
ఇదీ చూడండి: