ఎస్సీ వర్గీకరణ విషయంలో దేశవ్యాప్త పార్టీలన్నీ మోసగించాయని, చివరికి కోర్టులు కూడా ఒకరి పక్షాన నిలిచాయని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు, జాతీయ నాయకుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. చిత్తూరు జిల్లా తంబళ్లపల్లిలో నిర్వహించిన ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాల సమీక్ష సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వర్గీకరణ విషయంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి మినహా ఇతర నాయకులు ఎవరు మాదిగలకు మద్దతు తెలపలేదని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేస్తానంటూ ఎన్నికల సమయంలో మాటిచ్చి మోసగించాడని దుయ్యబట్టారు. కేసీఆర్ కూడా మాదిగల విషయంలో దారుణమైన మోసానికి ఒడిగట్టాడని మండిపడ్డారు.
పార్టీలు ఏళ్లగా మోసగిస్తున్నాయి..
జాతీయస్థాయిలో సుదీర్ఘ పరిపాలన చేసిన కాంగ్రెస్, భాజపాలు ఏళ్ల తరబడి మాదిగల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ సైతం వర్గీకరణ విషయంలో మద్దతు తెలిపే సూచనలు కనిపించడం లేదన్నారు.
ఉద్యమంతో సాధిస్తాం..
సుదీర్ఘ ఉద్యమాలతోనే వర్గీకరణ సాధించుకుందామని పిలుపునిచ్చారు. సుప్రీంకోర్టులో త్వరలోనే ఏడుగురు న్యాయనిపుణులచే విచారణ జరగనున్న నేపథ్యంలో గ్రామస్థాయి నుంచి మాదిగలను చైతన్యపరిచి వర్గీకరణపై విజయం సాధించుకునేందుకు పోరాడదామని మందకృష్ణ తెలిపారు. చట్టసభల్లో ఎన్నో బిల్లులు ప్రవేశపెట్టిన పాలకులు వర్గీకరణ బిల్లు పెట్టకపోవడం బాధాకరమన్నారు. ఉద్యమాల ఫలితంగానే 22 వేల ఉద్యోగాలు సాధించామని ఎంఈఎఫ్ (మాదిగల ఎంప్లాయిస్ ఫెడరేషన్) నాయకుడు సుబ్బరాజు పేర్కొన్నారు. అణచివేత, ఫ్యాక్షనిజం, మూఢ విశ్వాసాలు, అవమానాలు, అరాచకాలు, అభివృద్ధికి దూరంగా కాలం వెళ్లదీస్తున్న మాదిగలను.. మాదిగ దండోరా చైతన్య పరిచిందని రాష్ట్ర నాయకుడు నరేంద్ర మాదిగ అన్నారు. ఎమ్మార్పీఎస్ సుదీర్ఘ ఉద్యమంతో వర్గీకరణ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: 'ఎన్నికలంటే ప్రభుత్వానికి భయమెందుకు?'