చిత్తూరు జిల్లా మదనపల్లె గ్రామీణ మండలం శివనగర్‌లో పురుషోత్తంనాయుడు, పద్మజ దంపతులు కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. పురుషోత్తంనాయుడు మదనపల్లెలోని మహిళా డిగ్రీకళాశాల వైస్ ప్రిన్సిపల్‌గా విధులు నిర్వహిస్తుండగా... ఆయన భార్య పద్మజ ఓ ప్రైవేట్ పాఠశాలకు ప్రిన్సిపల్, కరస్పాండెంట్‌గా ఉన్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్దమ్మాయి అలేఖ్య వయసు 27 సంవత్సరాలు కాగా... చిన్నమ్మాయి సాయిదివ్య వయసు 22 ఏళ్లు. అలేఖ్య భోపాల్‌లో పీజీ కోర్సును అభ్యసిస్తుంది. సాయిదివ్య బీబీఏ పూర్తి చేసి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అకాడమీలో సంగీతం నేర్చుకుంటోంది.
వీరంతా గతేడాది ఆగస్టులో శివనగర్‌లో నూతనంగా నిర్మించిన ఇంట్లోకి వచ్చారు. ఇంట్లో తరచూ పూజలు చేసే వారని స్థానికులు చెబుతున్నారు. బయటి వారిని ఇంట్లోకి రానిచ్చే వారు కాదని తెలిపారు. ఆదివారం రాత్రి పూజలు నిర్వహించి.. మొదటిగా చిన్నకుమార్తె సాయిదివ్యను శూలంతో పొడిచి చంపేశారు. తర్వాత పెద్దకుమార్తె అలేఖ్య నోటిలో రాగి చెంబు పెట్టి డంబెల్‌తో కొట్టి హతమార్చారు. ఈ విషయాన్ని పురుషోత్తంనాయుడు... తాను పనిచేసే కళాశాలలోని ఓ అధ్యాపకుడికి చెప్పడంతో ఆయన ఇంటికి చేరుకుని పరిస్థితిని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి అక్కడికి చేరుకునే సరికే...అలేఖ్య, సాయిదివ్య ఇద్దరూ అత్యంత పాశవికంగా హత్యకు గురై రక్తపు మడుగులో పడి ఉన్నారు.
ప్రాథమిక విచారణ మేరకు... తల్లిదండ్రులు పద్మజ, పురుషోత్తంనాయుడులు పూర్తిగా మానసిక రుగ్మతలతో బాధపడుతున్నట్లు తెలిసిందని డీఎస్పీ చెప్పారు. ఇంటిచుట్టూ ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించిన అనంతరం బయటి వ్యక్తులెవరూ లోనికి రాలేదని తేలిందన్నారు. అతీతశక్తులున్నాయని ఇద్దరు నమ్మేవారని చెప్పారు. సత్యయుగం ప్రారంభమవుతోందని, తన బిడ్డలిద్దరూ తిరిగి ప్రాణాలతో లేచి వస్తారనే చంపినట్లు... తల్లి పద్మజ సమాధానం చెప్పినట్లు డీఎస్పీ తెలిపారు.
క్లూస్‌టీమ్‌ను రంగంలోకి దించిన పోలీసులు ఆధారాలు సేకరించారు. తండ్రి పురుషోత్తం నేరం జరుగుతున్న సమయంలో ఇంటిలోనే ఉండటంతో ఆయన పాత్రపైనా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆధారాలన్నీ సేకరించిన అనంతరం మృతదేహాలను మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇంటిలోనే వారి తల్లిదండ్రులు పోలీసుల అదుపులో ఉన్నారు. హత్యలకు కారణాలను మదనపల్లె పోలీసులు అన్వేషిస్తున్నారు.
ఇదీ చదవండీ... మదనపల్లెలో దారుణం..ఇద్దరు కుమార్తెలను చంపిన తల్లి