తపాలా సేవింగ్స్ ఖాతాలో ఇక నుంచి కనీస నిల్వ రూ.500 తప్పనిసరి అయ్యింది. ఈ మేరకు భారత తపాలాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఖాతాలో కనీస నిల్వతో పాటు నామినీ వివరాలు సరిచూసుకోవాలని చిత్తూరు జిల్లా తిరుపతి తపాలా డివిజన్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటి వరకు నమోదు కాని ఖాతాలకు నామినీ వివరాలు జతచేసుకోవాలని చెప్పారు. ఆధార్, మొబైల్ నెంబరును ఖాతాలకు అనుసంధానం చేసుకోవాలన్నారు. దీనివల్ల లావాదేవీల వివరాలు సంక్షిప్త సందేశాల ద్వారా అందించే వీలు కలుగుతుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ నెల 12 నుంచి దేశవ్యాప్తంగా ఈ నిబంధన అమలులోకి రానుందని అధికారులు ప్రకటించారు. 11వ తేదీ లోపు రూ.500 నిల్వ ఉండేలా జాగ్రత్తపడాలని తపాలాశాఖ అధికారులు స్పష్టం చేశారు. కనీస నిల్వ లేనట్లయితే ప్రతి ఆర్థిక సంవత్సరానికి నిర్వహణ రుసుముగా రూ.100 జరిమానా విధించబడుతుందని చెప్పారు. తపాలాశాఖ తాజా నిర్ణయంతో కోట్లాది ఖాతాదారులపై ప్రభావం పడనుంది.
ఇదీ చదవండి: వరి నాట్లు వేసిన చిత్తూరు జిల్లా కలెక్టర్