Lokesh Padayatra: పాదయాత్రలో అందరికీ ముద్దులు పెట్టిన జగన్.. అధికారంలోకి వచ్చాక పన్నులతో పిడిగుద్దులు గుద్దుతున్నాడని టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని తవణంపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభించిన లోకేశ్.. కాణిపాకం వరసిద్ధి వినాయకుణ్ని దర్శించుకున్నారు. పాదయాత్రలో భాగంగా లోకేశ్‌కు మహిళలు హరతులు పట్టి, టీడీపీ శ్రేణులు అడుగడుగున పూలమాలలు వేస్తూ ఘనస్వాగతం పలికారు. అనంతరం తవణంపల్లి విడిది కేంద్రంలో గాండ్ల సామాజిక వర్గీయులతో సమావేశమయ్యారు.
గాండ్ల కులస్తుల సమస్యల పరిష్కరిస్తాం : కష్టజీవులైన గాండ్ల కులస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని.. టీడీపీ అధికారంలోకి తేవడానికి మీ వంతు సహకారం అందించాలని లోకేశ్ తెలిపారు. తవణంపల్లి వద్ద ప్రజలతో మాట్లాడిన లోకేశ్ సీఎం బయటకు వస్తే పరదాల మాటున ఉంటున్నాడని.. ప్రజలని చూస్తే భయం.. సీబీఐని చూస్తే ఇంకా ఎక్కువ భయపడుతున్నాడన్నారు. బాబాయిని చంపింది అబ్బాయేనని ఆరోపించారు. యువతకు భవిష్యత్ బాగుండాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా సైకో పోయి.. సైకిల్ రావాలి అని తెలిపారు.
స్థానిక హైస్కూల్ లో కనీసం మౌలిక సదుపాయాలు లేవని.. కానీ నాడు - నేడు అంటూ హడావిడి చేయడం తప్ప అభివృద్ది లేదన్నారు. ప్రజల్లోకి వచ్చినందుకు నాపై కేసులు పెడుతున్నారని.. ఎన్ని కేసులు పెట్టినా బెదరం, భయపడమన్నారు. కొడాలి నాని పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని.. నోరు అదుపులో ఉంచుకోవాలని హెచ్చరించారు.
రాష్ట్ర అభివృద్ధి ఎవరు చేశారో..: రాష్ట్ర అభివృద్ధి ఎవరు చేశారో.. పరిశ్రమలు పక్క రాష్ట్రానికి ఎవరు తరిమారో చర్చించడానికి సిద్దమా అని లోకేశ్ సవాల్ విసిరారు. టీడీపీ హయాంలో 6 లక్షల ఉద్యోగాలు వచ్చాయని వైసీపీ మంత్రి అసెంబ్లీలో చెప్పారని గుర్తు చేశారు. అడుగడుగునా వైసీపీ నేతలను చెప్పులతో కొట్టేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎద్దేవా చేశారు.
ముస్లింలను రాజకీయంగా ప్రోత్సహిస్తాం : వైసీపీ ప్రభుత్వం ముస్లింలపై బనాయించిన అక్రమ కేసులను టీడీపీ అధికారంలోకి రాగానే మూడు నెలల్లో ఎత్తి వేస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. పాదయాత్రలో భాగంగా కాణిపాకంలోని యుఎస్ఎం కళ్యాణమండపంలో ముస్లిం మైనారిటీలతో లోకేశ్ సమావేశం నిర్వహించిన ఆయన.. ముస్లింలకు వెన్నుపోటు పొడిచిన ఘనత జగన్ కు దక్కిందని అన్నారు.
ముస్లింలలో పేదరికాన్ని గుర్తించి ఆనాడు ఎన్టీఆర్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని.. టీడీపీ హయాంలో రాజకీయంగా ముస్లింలను ప్రోత్సహించామని తెలిపారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఇంటర్, డిగ్రీ చదవే విద్యార్థులపై హత్యాయత్నం కేసులు పెట్టించాడని ఆరోపించారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మైనారిటీ కార్పొరేషన్ కి నిధులు కేటాయించడం లేదన్నారు.
టీడీపీ హయాంలో ఇచ్చిన దుల్హన్, రంజాన్ తోఫా, విదేశీ విద్య జగన్ రద్దు చేశాడని తెలిపారు. ముస్లింలను ప్రయోజకులను చేయడానికే చంద్రబాబు విదేశీ విద్య ప్రవేశపెడితే జగన్ అధికారంలోకి వచ్చాక రద్దు చేశాడన్నారు. ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీ ఎక్కడ అని ప్రశ్నించారు. ముస్లింలకు ఎవరు మేలు చేశారో ఆలోచించాలని కోరారు.
తప్పుడు కేసులు పెడితే పోలీసులకు ఇబ్బంది తప్పదని.. జ్యుడీషియల్ విచారణ జరిగితే చట్టాన్ని అతిక్రమించిన వారంతా శిక్షించబడతారని తెలిపారు. ముస్లింలపై జరిగిన అన్యాయంపై ఉప ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. జగన్‌లా నెరవేర్చలేని ఉచిత హామీలు నేను ఇవ్వనని.. రాజకీయంగా ఎలా ప్రోత్సహించాలో తాను చూసుకుంటానని హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి: