కచ్చితమైన కొలతలు ఇవ్వటం ద్వారా భూ హక్కుల విషయంలో ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపవచ్చునని.. జిల్లా సర్వే, ల్యాండ్ రికార్డ్స్ శాఖ సహాయ సంచాలకులు గిరిధర్‌రెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా గుడిపాల మండలం ముట్టుకూరుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో డ్రోన్ కెమెరా ద్వారా భూముల రీ సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
చిత్తూరు జిల్లాకు సంబంధించి 27 లక్షల ఎకరాల్లో మూడు విడతలుగా సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తామని సహాయ సంచాలకులు తెలిపారు. జిల్లాలోని 66 మండలాల్లో మెుదటి విడత కార్యక్రమం.. నేటి నుంచి జూలై వరకు 205 గ్రామాల్లో 2.14 లక్షల ఎకరాల్లో చేపట్టనున్నట్లు వెల్లడించారు. రెండో విడత ఆగస్టు నుంచి 2022 మార్చి వరకు 647 గ్రామాల్లో, మూడో విడత ఏప్రిల్ 2022 నుంచి కొనసాగుతుందని వివరించారు. డ్రోన్ కెమెరా ద్వారా పొందిన వివరాలను లేబరేటరీలో డౌన్లోడ్ చేసి వివరాలు భద్రపరచుతామన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి డ్రోన్, కార్స్, రోవర్ వంటి పరికరాలను భూ సర్వేకు వినియోగిస్తామని వివరించారు.
ఇదీ చదవండి: మాయమాటలు చెప్పి సెల్ఫీ అంటాడు.. మార్ఫింగ్ చేసి డబ్బులు గుంజుతాడు