తిరుమల తిరుపతి దేవస్థానం నూతల ధర్మకర్తల మండలి కొలువుదీరింది. 36 మంది సభ్యులతో ఏర్పాటైన ధర్మకర్తల మండలి తొలి సమావేశం తిరుమల అన్నమయ్య భవనంలో జరిగింది. ధర్మకర్తల మండలి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గత నిర్ణయాలను రద్దు చేసి సరికొత్తగా తీర్మానాలు చేశారు. అమరావతి ఆలయ పరిధిని పరిమితి చేయడమే కాక.. పాటు అవిలాల చెరువు అభివృద్ధి పనులను భారీగా కుదించారు. సమావేశంలో తీసుకొన్న నిర్ణయాలను ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వివరించారు. ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్న పలు అంశాలపై చర్చించి పాలనకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకొన్నామన్నారు.
సమావేశంలో తీసుకొన్న నిర్ణయాలు
- తిరుమలలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు బాలాజీ రిజర్వాయర్ నిర్మాణానికి నిధుల కేటాయింపు
- అమరావతిలో 150 కోట్ల రూపాయలతో తలపెట్టిన శ్రీవారి ఆలయ నిర్మాణ వ్యయం రూ . 36 కోట్లకు తగ్గింపు
- ఆలయ తొలి ప్రాకారం మాత్రమే నిర్మించాలని తీర్మానం
- తిరుపతిలోని అవిలాలకు సంబంధించి తిరుపతి వాసులకు ఉపయోగకరంగా ఉండేలా చెరువు, పార్కు మాత్రమే నిర్మించాలని నిర్ణయం
- తిరుమలలో పర్యావరణాన్ని కాపాడేందుకు ఎలక్ట్రిక్ బస్సులు, ఎలక్ట్రిక్ కార్లు ప్రవేశపెట్టాలని నిర్ణయం
- తితిదేలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులపై సమస్యలపై చర్చించేందుకు సబ్ కమిటీ ఏర్పాటు
- రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించిన అనంతరం గరుడ వారధి నిర్మాణానికి నిధుల కేటాయింపుపై నిర్ణయం
- తితిదే విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు వసతి గృహాల నిర్మాణానికి వంద కోట్ల రూపాయలు కేటాయింపు
- వచ్చే విద్యాసంవత్సరం నుంచి తితిదే విద్యాసంస్థల్లో యాజమాన్య కోటా రద్దు చేస్తూ నిర్ణయం
- తితిదే ఉద్యోగుల కోసం అత్యంత ఆధునిక మైన క్రీడా ప్రాంగణం నిర్మాణానికి పదికోట్ల రూపాయలు కేటాయింపు
- శ్రీవాణి ట్రస్టుకు విరాళాలు ఇచ్చే భక్తులకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించాలని నిర్ణయం
ఉప సంఘాల ఏర్పాటు
ఆరు నెలల సుదీర్ఘ విరామం అనంతరం కొత్తగా ఏర్పాటైన ధర్మకర్తల మండలి తొలి సమావేశంలో.. 180 అంశాలతో కూడిన భారీ అజెండాను రూపొందించారు. సమయాభావంతో కేవలం గంటన్నర మాత్రమే చర్చ జరగ్గా.. మిగిలిన కీలక అంశాలను వచ్చే సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు. అజెండాలోని మరికొన్ని అంశాలపై ఉప సంఘాలను నియమించారు. ధర్మకర్తల మండలి సభ్యులతో ఏర్పాటు చేసిన ఉప సంఘాలు సమావేశమై వాటిపై నిర్ణయాలు తీసుకొని ఛైర్మన్‌కు నివేదికలు సమర్పిస్తాయి. వీటి అధారంగా వచ్చే సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.
సభ్యుల ప్రమాణస్వీకారం
సోమవారం ఉదయం ధర్మకర్తల మండలి సభ్యులుగా ఎంపికైన 24 మందిలో 17 మంది స్వామివారి సన్నిధిలో పదవీ ప్రమాణం చేశారు. తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కరరెడ్డితో పాటు మరో ఇద్దరు సభ్యులు శనివారమే పదవీ బాధ్యతలు చేపట్టగా మరో నలుగురు వివిధ కారణాలతో పదవీ ప్రమాణ స్వీకారం చేయలేదు. ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపికైన తిరుపతి శాసనసభ్యుడు కరుణాకరరెడ్డితో పాటు మరో ఆరుగురు బోర్డు సమావేశం అనంతరం ప్రమాణ స్వీకారం చేశారు