చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం బోయకొండలో ఇళ్ల తొలగింపు వ్యవహారం ఉద్రిక్తతలకు దారితీసింది. బోయకొండ గంగమ్మ ఆలయం అభివృద్ధిలో భాగంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల్లో నిర్మించుకున్న ఇళ్లను ప్రభుత్వం తొలగిస్తోంది. రెండు నెలల క్రితం ఆలయం పరిసర ప్రాంతాల్లో దాదాపు వంద ఇళ్ల వరకు తొలగించారు. ప్రభుత్వ భూములైనప్పటికీ తమకు ఇళ్ల పట్టాలు ఇచ్చారని వరలక్ష్మీ, లలితమ్మ కుటుంబాలు ఇళ్ల కూల్చివేతను అడ్డుకున్నారు. పరిహారం చెల్లించకుండా ఇళ్ల కూల్చివేతపై కోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ అనంతరం పరిహారం చెల్లించాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ముప్పై లక్షల రూపాయల పరిహారం చెక్కును వరలక్ష్మి, లలితమ్మ కుటుంబాలకు అందజేసి ఇళ్లు కూల్చివేతకు సిద్దపడ్డారు. కానీ పరిహారం అరవై లక్షలు చెల్లించాలని.. ముప్పై లక్షలకు అంగీకరించమని బాధితులు ఆందోళనకు దిగారు. కూల్చివేతకు అడ్డువచ్చిన రెండు కుటుంబాల సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులు సామాన్లను బయటపెట్టి ఇల్లు కూల్చివేశారు. తగినంత పరిహారం చెల్లిస్తే ఖాళీ చేసేందుకు సిద్దంగా ఉన్నా పరిహారం చెల్లించకుండా సామాన్లను బయటపడేసి ఇళ్లు కూల్చివేశారని బాధితులు వాపోతున్నారు. ఇళ్ల కూల్చివేత సమాచారం తెలుసుకున్న తెదేపా పుంగనూరు నియోజకవర్గ ఇంఛార్జి శ్రీనాథరెడ్డి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఇదీచదవండి