High Court Reserved Judgment on Punganur Incident: పుంగనూరు కేసులో తెలుగు దేశం నేత చల్లా రామచంద్రారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వ్‌లో పెట్టింది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పుంగనూరు పర్యటన సందర్భంగా అన్నమయ్య జిల్లా భీమగానిపల్లె కూడలి వద్ద జరిగిన ఘటనలో పుంగనూరు పోలీసులు పలువురిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిలు ఇవ్వాలని కోరుతూ చల్లా రామచంద్రారెడ్డి( Challa Ramachandra Reddy) హైకోర్టును ఆశ్రయించారు. ఘటన జరిగిన సమయంలో పిటిషనర్ అక్కడ లేరని పిటిషనర్ న్యాయవాది వాదించారు. ఒకే ఘటనలో బహుళ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధం అన్నారు. రాజకీయ దురద్దేశంతోనే పిటిషనర్‌పై కేసు నమోదు చేశారని వాదనలు వినిపించారు. టీడీపీ నేత ఘటన జరిగిన సమయంలో అక్కడ ఉన్నారని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. తీర్పును రిజర్వులో (Court Reserved Judgment) ఉంచింది.
ఇది జరిగింది: అన్నమయ్య జిల్లా(annamayya district) తంబళ్లపల్లె నియోజకవర్గ పరిధిలో... కురబలకోట మండలం అంగళ్లు గ్రామం, ఆ తర్వాత చిత్తూరు జిల్లా పుంగనూరు ప్రాంతాల్లో.. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమం కోసం... టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చిన సమయంలో.. యాత్రను అడ్డుకోవడానికి వైసీపీ నాయకులతోపాటుగా.. కార్యకర్తలు, పోలీసులు ప్రయత్నించారు. వైసీపీ నేతలు టీడీపీ(TDP) నేతలపై కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. అయినప్పటికీ పోలీసులు వైసీపీ నేతల పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం.. తీవ్ర ఘర్షణలకు కారణమైంది. అంగళ్లు గ్రామంలో చంద్రబాబు పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేసి.. టీడీపీ జెండాలతోపాటుగా ఫ్లెక్సీలను వైసీపీ నాయకులు చించివేశారు. చంద్రబాబు గోబ్యాక్ అంటూ... పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలపై దాడులకు దిగారు. ఇన్ని జరుగుతున్నా వైసీపీ శ్రేణులను పోలీసులు నియంత్రించలేదని టీడీపీ నేతలు ఆరోపించారు.
ఓర్పు నశించి: చంద్రబాబు.. అంగళ్లు గ్రామ సమీపంలోకి రాగానే... అక్కడ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న వైసీపీ శ్రేణులను అప్పటివరకు నియంత్రించని పోలీసులు.. చంద్రబాబు వచ్చినప్పుడు మాత్రం అటువైపు వెళ్లకుండా అడ్డుకునేందుకు యత్నించారు. అయినా వైసీపీ(YCP) కార్యకర్తలు మరింత రెచ్చిపోయారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో పాటుగా వచ్చిన తెలుగుదేశం నాయకులతోపాటుగా... కార్యకర్తల్లో ఓర్పు నశించింది. తమ తమ వాహనాల్లో నుంచి కింది దిగి.. వారి వద్ద నున్న జెండా కర్రలతో వైసీపీ శ్రేణులను తరిమికొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకోగా.. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి.
టీడీపీ నేతలపై కేసులు: అంగల్లు, పుంగనూరు ఘటనల్లో పార్టీ అధినేత చంద్రబాబుతో సహా వందల మంది టీడీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు నమోదు అయ్యాయి. మరో సంఘటనల్లో 12 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయ్యాయి. సుమారు 317 మందిపై హత్యాయత్నం.. సహా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇప్పటికే 81 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిలు ఇవ్వాలని కోరుతూ చల్లా రామచంద్రారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఘటన జరిగిన సమయంలో పిటిషనర్ అక్కడ లేరని పిటిషనర్(Petitioner) న్యాయవాది వాదించారు. రాజకీయ దురద్దేశంతోనే పిటిషనర్‌పై కేసు నమోదు చేశారని వాదనలు వినిపించారు.