చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో..స్వర్ణముఖి నదికి పెద్ద ఎత్తున వరద పోటెత్తుతోంది. దీంతో కల్యాణి డ్యాంకు ఉన్న మూడు గేట్లను తెరిచి 1700 క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేశారు. 1996 తర్వాత మళ్లీ ఇప్పుడు జలాశయం గేట్లను తెరిచారు. ఏర్పేడు-సదాశివపురం, శ్రీకాళహస్తి-పాపానాయుడుపేట, గుడిమల్లం-శ్రీకాళహస్తి, పంగురు-శ్రీకాళహస్తి, వెంకటగిరి ప్రధాన రహదారులపై... కాజ్‌వేల పైకి ప్రమాదకరంగా నీరు ప్రవహిస్తోంది. అధికారులు ముందస్తుగానే ఆయా రహదారులపై రాకపోకలను నియంత్రించారు. చెరువులు పూర్తిస్థాయిలో నిండి...ప్రమాదకరంగా ఉన్నాయి. శ్రీకాళహస్తి మండలం మూర్తిపాలెం చెరువుకు ఐదు రోజుల కిందట గండి పడినా...మరమ్మతులు చేపట్టకపోవడంతో...కొండ ప్రాంతంలోని వరద నీరంతా దిగువ ప్రాంతాలకు చేరుతోంది. వరద నీరు కొత్తూరులోని నీళ్లలోకి ప్రవేశించింది. పంట పొలాలు నీటమునిగాయి.
అంత్యక్రియల కోసం అగచాట్లు..
ఏర్పేడు మండలం కొత్తవీరాపురంలో...మృతదేహానికి అంత్యక్రియల కోసం స్థానికుల అగచాట్లు పడ్డారు. వర్షాలతో స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్న స్మశానవాటికలోకి వరద నీరు చేరింది. మరోదారి లేకపోవడంతో.. మృతదేహాన్ని తీసుకుని నదిలో ఈదుకుంటూ బంధువులు స్మశానానికి చేరుకున్నారు.
నీటిలో మునిగిన పాఠశాల బస్సు..
చిత్తూరు నగరంలోని దొడ్డిపల్లె రైల్వే అండర్ పాస్ రహదారిలో భారీగా వర్షపు నీరు చేరుకుంది. వర్షపు నీటిలో ఓ ప్రైవేటు పాఠశాల బస్సు చిక్కుకుపోయింది. వ్యానులో 30 మంది వరకు పిల్లలకు ఉన్నారు. దీన్ని గమనించిన స్థానికులు నీళ్ళలోకి దూకి సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది సహాయంతో వ్యానును బయటకు తీసుకొచ్చారు. వ్యానులోని పిల్లలు సరక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లో కొన్ని గ్రామాలు నీట మునిగాయి. తిరుపతి రూరల్, రామచంద్రాపురం, చంద్రగిరి, పాకాల, యర్రావారిపాళ్యం, చిన్నగొట్టిగల్లు మండలాలలో కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పంటపొలాలు, నివాస ప్రాంతాలు నీట మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నలుగురు మహిళలు గల్లంతు
బంగారుపాళ్యం మండలం టేకుమందకు చెందిన నలుగురు మహిళలు వాగులో కొట్టుకుపోయారు. శ్రీని ఫుడ్‌పార్కులో పని ముగించుకుని రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో ఆటోలో మహిళలు ఇంటికి బయలుదేరారు. బలజపల్లి-టేకుమంద రహదారిలో కాజ్‌వేపై నీరు ప్రవహిస్తుండటంతో ఆటో నిలిచిపోయింది. అందరూ ఒకరికొకరు చేయిపట్టుకుని ఒడ్డుకు చేరే క్రమంలో నలుగురు మహిళలు వాగులో కొట్టుకుపోయారు.SPOT
ద్విచక్రవాహనంతో సహా...
వెదురుకుప్పం మండలంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. దేవగుడిపల్లి సమీపంలో పులుసు నీటి వాగులో ద్విచక్రవాహనంతో సహా యువకుడు కొట్టుకుపోయాడు. వాగులో ఉన్న చెట్టును పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్న యువకుడిని స్థానికులు రక్షించగా...బైక్ వాగులో కొట్టుకుపోయింది.
గేట్లు ఎత్తివేత
తలకోన దేవాలయం పూర్తిగా జలమయమైంది. మూలపల్లి చెరువు నిండటంతో స్థానికులు ఇళ్లు ఖాళీ చేసి ఎత్తైన ప్రదేశానికి చేరుకున్నారు. కల్యాణి డ్యాంకు భారీగా వరదనీరు చేరడంతో గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. శ్రీనివాసమంగాపురం వద్ద స్వర్ణముఖి వాగు దాటుతుండగా ఒక ఆటో, రెండు ద్విచక్రవాహనాలు కొట్టుకుపోయాయి. ఎర్రవారిపాలెం వద్ద వరద నీటలో కారు కొట్టుకుపోయింది.
శ్రీకాళహస్తిలో...
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జోరువానలు కురిశాయి. మూర్తిపాలెం చెరువుకట్ట కింద గండి పడినప్పటికీ అధికారులు మరమ్మతులు చేపట్టకపోవడంతో వరద నీరు దిగువ ప్రాంతాలను ముంచెత్తోంది. కొత్తూరులో ఇళ్లు నీట మునిగాయి. స్వర్ణముఖి నదికి పెద్ద ఎత్తున వరద పోటెత్తడంతో....ఏర్పేడు-సదాశివపురం, శ్రీకాళహస్తి - పాపా నాయుడు పేట, గుడిమల్లం -శ్రీకాళహస్తి, పంగురు-శ్రీకాళహస్తి ,వెంకటగిరి ప్రధాన రహదారులపై కాజ్‌వేలపై వరద నీరు ప్రవహిస్తుంది.
తిరుపతిని ముంచెత్తుతున్న భారీ వర్షం
తిరుపతిని భారీ వర్షం ముంచెత్తుతోంది. అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి తిరుపతి నగరంలోని లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. తిరుమల కొండల్లో కురిసిన భారీ వర్షంతో కపిల తీర్థం, మల్వాడి గుండం జలపాతలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. కాలువల పరివాహక ప్రాంతాలను ముంపునకు గురయ్యాయి. లక్ష్మీపురం కూడలి, దేవేంద్ర థియేటర్ కూడలి, కరకంబాడి రోడ్డు, తిరుచానూరు రోడ్డు నీట మునిగాయి. భారీ వర్షాల దృష్ట్యా అధికారులను అప్రమత్తం చేసినట్లు చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ్ తెలిపారు.
ఇదీ చదవండి
Rains: చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు..తిరుమలలో విరిగిపడ్డ కొండచరియలు