చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో హంద్రీనీవా కాలువను తవ్వి 10 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఇప్పటివరకు చుక్కనీరు రాలేదు. జిల్లాలోని పీలేరు యూనిట్-2 హంద్రీనీవా కాలువ ద్వారా 15 మండలాల్లో 80 వేల ఎకరాలకు సాగునీరు, వందలాది గ్రామాలకు తాగునీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు 7,410 ఎకరాల్లో కాలువలు తవ్వారు. 350 కోట్ల రూపాయలతో 1.45 టీఎంసీల సామర్ధ్యంతో అడవిపల్లి రిజర్వాయర్ నిర్మించారు.
ఎత్తిపోతల కోసం 6 చోట్ల లిఫ్ట్ కేంద్రాలు నిర్మించారు. మోటార్లు, విద్యుత్ సబ్స్టేషన్లు, కంట్రోల్ ప్యానెల్ బోర్డులు ఏర్పాటు చేశారు. ఏళ్లతరబడి విద్యుత్ పరికరాలు వినియోగించని కారణంగా అవి తుప్పుపడుతున్నాయి. కాలువలు ముళ్ల కంపలతో దర్శనమిస్తున్నాయి. 90 శాతం పనులు పూర్తయ్యాయి. రెండుమూడు చోట్ల కాలువకు అడ్డుగా ఉన్న వంకలపై కొన్ని పనులు చేయాల్సి ఉంది.
ఈ పనులు పూర్తికాని కారణంగా నీరు వచ్చే పరిస్థితులు కనబడటంలేదు. ఈ ప్రాంతాల్లో వర్షాలు పడక చెరువులు, కుంటలు ఎండిపోయాయి. వందలాది ఎకరాలు బీళ్లుగా మారాయి. సాగు, తాగు నీటికి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి కాలువల పనులు పూర్తిచేయాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: ఎండమావులు చూపి.. ఎడారిలో దింపి..!