చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె మండలం గుండ్లపల్లి గ్రామ పరిధిలోని పాత చెరువు ప్రమాదస్థితిలో ఉంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మోదుగమల అటవీ ప్రాంతం నుంచి వాగుల ద్వారా వచ్చిన నీటితో చెరువు పూర్తిగా నిండిపోయింది. గతంలో గండి పడిన చోట చేపట్టిన మరమ్మతుల వద్దనే.. రెండు పెద్ద చీలికలు ఏర్పడ్డాయి. ఇక ఏ మాత్రం వర్షాలు కురిసినా కట్ట తెగిపోయే ప్రమాదం ఉంది.
ఇప్పటికే ఈ చెరువు కట్ట మూడుసార్లు తెగిపోయింది. అటవీ ప్రాంతంలో ఉన్నందున వాగులు, వంకల ప్రవాహానికి తరచుగా కట్ట తెగిపోతున్నాయి. కట్ట మరమ్మతుల కోసం ఇప్పటికే 10 లక్షల వరకు ఖర్చు చేశారు. ఈసారైనా అధికారులు అప్రమత్తమై కట్ట తెగిపోకముందే కాపాడాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. ఈ చెరువులో నీళ్లు ఉంటే వన్యప్రాణులు, మూగజీవాలు దాహం తీర్చుకుంటాయి. వ్యవసాయం బోర్లు, బావులలో నీటి మట్టం పెరగడానికి దోహదపడుతుంది. ఈ గ్రామ పరిధిలో వందకు పైగా ఎకరాల ఆయకట్టు ఉంది. సంబంధిత శాఖ అధికారులు తక్షణం కట్ట భద్రత పనులు చేపట్టాలని ఆ ప్రాంత వాసులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: కాంట్రాక్టు ఉద్యోగులకు సకాలంలో జీతాలు: సీఎం జగన్