తిరుపతి ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు స్మార్ట్ ఎలివేటెడ్ కారిడార్ పేరుతో... తిరుచానూరు మార్కెట్‌యార్డు నుంచి కపిలతీర్థం సమీపంలోని నంది కూడలి వరకు గరుడ వారధి నిర్మాణం చేపట్టారు. దాదాపు 6 కిలోమీటర్ల పొడవైన పైవంతెన నిర్మాణాన్ని... 684 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో తిరుపతి స్మార్ట్‌సిటీ కార్పొరేషన్, తితిదే సంయుక్తంగా ప్రారంభించాయి. ఇందులో తితిదే 458 కోట్లు, స్మార్ట్ సిటీ కార్పొరేషన్ 226 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించాయి. నిర్మాణ పనులు దక్కించుకొన్న ఆఫ్కాన్ సంస్థ 6 నెలల కిందటే పనులు ప్రారంభించింది. కొన్ని పిల్లర్ల నిర్మాణం పూర్తి చేసింది.
అంతవరకు సాఫీగానే సాగినా... తితిదే కొత్త పాలకమండలి తొలి సమావేశంలోనే గరుడ వారధి నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. నిధుల కేటాయింపు, నిర్మాణం కొనసాగింపుపై రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడింది. అంతలోపే.. ధార్మికేతర ప్రాజెక్టులకు తితిదే నిధులు వినియోగించడం సరికాదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పరిస్థితుల్లో పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి.
తిరుపతిలో 9 రహదారులను తితిదే నిర్వహిస్తుండగా... ప్రధానమైన కే.టీ.రోడ్డులో గరుడ వారధి నిర్మిస్తున్నారు. ఆకర్షణీయ నగరంలో భాగంగా కేంద్ర ప్రభుత్వ నిధులను.... తమ వాటా కింద నగరపాలక సంస్థ ఈ ప్రాజెక్టుకు కేటాయించింది. మిగిలినవి తితిదే సమకూర్చుతోంది. అయితే వారధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడాన్ని భాజపా నేతలు తప్పుబడుతున్నారు.
వారధి పనులు చేపట్టాక ట్రాఫిక్ సమస్య తీవ్రమైందని... ఇప్పుడు నిర్మాణం ఆపేస్తే పరిస్థితి దారుణంగా తయారవుతుందని నగరవాసులు అంటున్నారు. వారధి విషయంలో తమ వాదనలు వినకుండా నిర్మాణాలపై స్టే విధించవద్దని కోరుతూ... అధికారులు కోర్టులో కేవియట్ దాఖలుచేశారు. ఈ పరిస్థితుల్లో కోర్టు నిర్ణయం వచ్చాకే గరుడ వారధి భవిష్యత్తుపై స్పష్టత రానుంది.