చిత్తూరు జిల్లా మదనపల్లె గ్రామీణ మండలం వలసపల్లెలో అమానవీయ ఘటన జరిగింది. కరోనాతో మరణించాడన్న అనుమానంతో మృతదేహాన్ని ఖననం చేయకుండా అడ్డుకున్నారు ఐదు గ్రామాల ప్రజలు.
మదనపల్లె పట్టణంలోని ఈశ్వరమ్మ కాలనీ వాసి(43) ఇటీవల అస్వస్థతకు గురయ్యాడు. వారం రోజులుగా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. అతను ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండటంతో... వైద్యులు తిరుపతికి రిఫర్ చేశారు. అనంతరం కుటుంబ సభ్యులు అతన్ని తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతదేహాన్ని మండలంలోని వలసపల్లెలో ఖననం చేసేందుకు మృతుని బంధువులు ప్రయత్నించారు. అయితే అతను కరోనాతో చనిపోయి ఉంటాడనే అనుమానంతో ఖననం చేయడాన్ని పరిసర గ్రామస్థులు అడ్డుకున్నారు.
కొవిడ్ పరీక్షలు నిర్వహించి నెగెటివ్ తేలితేనే ఇక్కడ ఖననం చేయాలని తేల్చిచెప్పారు. చేసేదేమీ లేక పోలీసులు, వైద్య సిబ్బందికి ఆదివారం ఉదయం సమాచారమిచ్చారు మృతుని బంధువులు. మృతదేహానికి సాయంత్రం మదనపల్లె ప్రభుత్వాస్పత్రిలో వైద్యులు కొవిడ్ పరీక్షలు చేశారు. అనంతరం మదనపల్లె శివారు అటవీ ప్రాంతంలో గొయ్యి తవ్వి ఖననం చేశారు.
ఇదీ చదవండి