చిత్తూరు జిల్లా చిత్తూరు గ్రామీణ మండలం శేషాచలపురానికి చెందిన జవాన్ దేవేంద్ర రెడ్డి మణిపూర్‌లోని ఇంఫాల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఈ రోజు ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే శ్రీనివాసులు, ఆర్డీవో రేణుక తదితరులు జవానుకు నివాళులు అర్పించారు.
గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం రెడ్డి, గోపమ్మల రెండో కుమారుడు దేవేంద్రరెడ్డి 2003లో ఆర్మీకి ఎంపికయ్యాడు. తల్లిదండ్రులు, సోదరుడు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. దేవేంద్రరెడ్డి ఇంఫాల్‌లో హిటాచీ ఆపరేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ నెల 11న వేకువజామున మరో ఇద్దరు జవాన్లతో కలసి శిక్షణ కోసం ఆర్మీ వాహనంలో వెళ్తుండగా ప్రమాదానికి గురై మరణించాడు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి స్వగ్రామానికి తరలించారు.
కుమారుడి మృతితో తల్లిదండ్రులు, బంధుమిత్రులు కన్నీరుమున్నీరయ్యారు. జవాన్ మరణ వార్త తెలిసి.. నివాళులు అర్పించేందుకు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు వచ్చారు. అనంతరం సైనిక లాంఛనాలతో దేవేంద్రరెడ్డి పార్థివదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.
ఇదీ చదవండి: వారొకటి తలిస్తే.. విధి ఒకటి తలిచింది.. ప్రయాణం విషాదమైంది!