కరోనా సమయంలో లాక్డౌన్ కారణంగా వ్యాపారాలు దెబ్బతింటున్నాయని పూల వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో పోలీసులు వేధింపులకు గురిచేయడం సమంజసంగా లేదన్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ.. చిత్తూరు జిల్లా మదనపల్లిలో పూల వ్యాపారులు ఆందోళన చేశారు. బెంగళూరు బస్టాండ్ లో రోడ్డుపై పూలను పారబోసి నిరసన తెలిపారు. లాక్ డౌన్ కారణంగా ఉదయం 6 నుంచి 11 గంటల మధ్యలోనే వ్యాపారాలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చారని.. అయితే ఆ సమయం సరిపోవడం లేదని తెలిపారు.
గ్రామాల నుంచి రైతులు తీసుకొచ్చిన పూలను ఈ సమయంలో కొనుగోలు, విక్రయాలు చేయడం కష్టమని తెలిపారు. 11 గంటలు కాకముందే పోలీసులు వారి వద్దకు వచ్చి దుకాణాలు మూసి వేయాలని ఒత్తిడి తెస్తున్నారని.. అందుకే తాము నిరసన తెలుపుతున్నామని తెలిపారు. ఉన్నతాధికారులు ఈ సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు గడువు ఇస్తే తాము వ్యాపారాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. సీఐ రాజేంద్ర యాదవ్ వ్యాపారులతో మాట్లాడి.. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో పూల వ్యాపారులు నిరసనను విరమించారు.
ఇదీ చదవండి: భారీగా దిగొచ్చిన బంగారం, వెండి ధరలు