అవినీతి నిరోధక శాఖ డీఎస్పీనంటూ చిత్తూరు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు వ్యక్తిగత కార్యదర్శికి ఫోన్ చేసి ఓ వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆ వ్యక్తి తనను హరికృష్ణగా పరిచయం చేసుకుని ఎమ్మెల్యే పీఏకు ఫోన్ చేశాడు. చిత్తూరులో వీఐపీల ఇళ్లల్లో సోదాలు చేస్తున్నామని చెప్పాడు. తమ బృందం దాడులు చేస్తూ చిత్తూరులోని ఒక లాడ్జిలో ఉన్నామని.. తమ దగ్గర ఏటీఎం కార్డులు మాత్రమే ఉన్నాయని ఖర్చులకు డబ్బు పంపమని అడిగాడు. తన గూగుల్ పే నెంబర్ పంపించి డబ్బులు పంపించమన్నాడు.
దీనిపై అనుమానం వచ్చిన ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు గూగుల్ పే నంబర్ ఆధారంగా నగరంలోని లాడ్జిలో ఉన్న నకిలీ ఏసీబీ అధికారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో పలు విషయాలు తెలిసినట్లు సమాచారం. హరికృష్ణ రాష్ట్రంలోని ప్రముఖ రాజకీయ నాయకుల ఆస్తుల వివరాలు సేకరించినట్లు తెలిసింది. దీని వెనుక పెద్ద నెట్వర్క్ ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా విచారణ చేపట్టారు.
ఇవీ చదవండి..