ఎన్టీ రామారావు అమలు చేసిన మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచి.. మద్యం విక్రయాలకు గేట్లు ఎత్తిన ఘనత చంద్రబాబుదేనని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి విమర్శించారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 43 వేల బెల్ట్ షాపులు ఏర్పాటయ్యాయని ఆయన చిత్తూరులో అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మద్యం ఏరులై పారిందని చెప్పారు.
జగన్ సీఎం అయిన వెంటనే మద్యపాన నిషేధానికి దశలవారీగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. పేదలకు అందుబాటులో ఉండకూడదనే ఉద్దేశంతో మద్యం ధరలను పెంచినట్లు చెప్పారు. కరోనా కారణంగా రాష్ట్రంలో రూ. 22వేల కోట్ల మేరకు ఆర్థిక నష్టం వాటిల్లిందని వివరించారు. ధరలు పెంచడం వల్ల మద్యం విక్రయాలు తగ్గుముఖం పట్టాయని చెప్పారు. రాబడి లేక ప్రభుత్వానికి నష్టం వాటిల్లినా... ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయడానికి సీఎం జగన్ వెనుకంజ వేయలేదన్నారు. విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ దుర్ఘటనలో మృతి చెందిన వారికి రూ.కోటి పరిహారం అందజేసినా... దీనిపై విపక్ష నేత చంద్రబాబు అర్థంలేని ఆరోపణలు చేశారని చెప్పారు. గతంలో పుష్కరాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన వారికి రూ.5 లక్షల పరిహారం ప్రకటించిన చంద్రబాబు చివరికి కేవలం రూ.2 లక్షలే ఇచ్చారని ఆరోపించారు.
ఇదీ చదవండి :