చిత్తూరు జిల్లా రామసముద్రం మండలం తిరుమలరెడ్డిపల్లిలో... చెల్లెలిపై అత్యాచారయత్నం చేయబోయాడని ఓ సోదరి నిందితుడిపై కొడవలితో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలు సమీపంలోని పొలానికి గొర్రెలు మేపేందుకు వెళ్లారు. మేకలు చెల్లాచెదురు కావడంతో ఇద్దరూ దూరంగా ఉన్నారు. ఇదే అదనుగా భావించిన అదే గ్రామానికి చెందిన శంకరప్ప(40) తన వాంఛ తీర్చుకోవడానికి బాలికను చెట్ల పొదల్లోకి లాక్కెళ్లాడు. చెల్లి అరుపులు విన్న అక్క పరిగెత్తుకుంటూ వచ్చి... కామాంధుడిని అడ్డుకుంది. వద్దని వేడుకున్నా వినకపోవడంతో.. తన చేతిలోని కొడవలితో నిందితుడిపై దాడి చేసింది. చెయ్యిపై తీవ్రంగా గాయమవ్వడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. జరిగిన విషయంపై బాలికలు తమ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా.. బాధితుల ఫిర్యాదు మేరకు రామసముద్రం పోలీస్‌స్టేషన్‌లో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడు కొంత కాలంగా బాలికను వెంబడిస్తున్నట్లు బాధితురాలి తండ్రి తెలిపారు. చేతికి తీవ్ర గాయం అవడంతో నిందితుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడన్న పోలీసులు..కోలుకున్నాక అరెస్ట్ చేస్తామని తెలిపారు.
ఇదీ చూడండి. స్విమ్స్ కొవిడ్ ఆస్పత్రిలో పెచ్చులు మీదపడి గర్భిణీ మృతి