దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ప్రత్యేక ఆర్థిక మండలి శ్రీసిటీపై కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. మూడు నెలలుగా లాక్‌డౌన్‌తో శ్రీసిటీ పరిశ్రమలలో ఉత్పత్తులు నిలిచిపోయాయి. లాక్‌డౌన్ సడలింపులతో కొంత మేర ఉత్పత్తులు ప్రారంభమైనా... కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుండటం పరిశ్రమల ఉత్పత్తిపై ప్రభావం చూపుతోంది. శ్రీసిటీలో 28 దేశాలకు చెందిన ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. ఈ పరిశ్రమల్లో తమిళనాడుతో పాటు చిత్తూరు, నెల్లూరు జిల్లాల నుంచి 50 వేల మంది పనిచేస్తున్నారు. పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగులు నెల్లూరు జిల్లా తడ, సుళ్లూరుపేట, నాయుడుపేట, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి, ఏర్పేడు, వరదయ్యపాళెం, సత్యవేడు, తిరుపతి ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు.
పరిసర గ్రామాల్లో పెరుగుతున్న కొవిడ్ కేసులు
శ్రీ సిటీలో పనిచేసే ఉద్యోగులు నివాసం ఉంటున్న ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. శ్రీసిటీ పరిధిలోని చెరివి, పెద్దేటిపాకం గ్రామాల్లో గడచిన రెండు రోజుల్లో 33 పాజిటివ్ కేసులు వచ్చాయి. చంగంబాకం, రామచంద్రాపురం గ్రామాల్లో మరో నలుగురు కరోనా బారిన పడ్డారు. గ్రామాల్లో కేసులు సంఖ్య పెరిగిపోతుండటంతో పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. శ్రీసిటీలో..ఓ పరిశ్రమలో పనిచేస్తున్న 40 మంది ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించగా 19 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో ఆ పరిశ్రమను మూసేశారు. ఆ ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించారు.
ఉద్యోగుల కోసం నివాస భవనాలు
శ్రీసిటీలో పనిచేసే పై స్థాయి ఉద్యోగులు పొరుగున ఉన్న చెన్నై నగరంలో నివాసం ఉండగా...కింది స్థాయి ఉద్యోగులు చిత్తూరు, నెల్లూరు జిల్లాల పరిధిలో నివాసం ఉంటున్నారు. ఉద్యోగులు ఉంటున్న ప్రాంతాలలో కేసులు పెరగడంతో... శ్రీసిటీపై ప్రభావం పడిందని యాజమాన్యం అంటుంది. ఉద్యోగుల కోసం పరిశ్రమల సమీపంలోనే మూడు స్థాయిల్లో భవనాలు నిర్మించాలని నిర్ణయించారు. ఉద్యోగులు స్థానికంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
లాక్‌డౌన్ సడలింపులతో తిరిగి తెరుచుకున్న కొన్ని పరిశ్రమలు.. 50 నుంచి 60 శాతం మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాయి. శ్రీసిటీ పరిశ్రమల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పాజిటివ్ వస్తుండటం....పరిసర ప్రాంతాలు కంటైన్‌మెంట్, రెడ్‌జోన్ పరిధిలోకి వెళుతుండటంతో పాక్షికంగా సాగుతున్న ఉత్పత్తిపై ప్రభావం చూపుతుందన్న ఆందోళన శ్రీసిటీ యజమాన్యంలో నెలకొంది.
ఇదీ చదవండి : శ్రీవారి దర్శన టికెట్లు పెంచుతున్న తితిదే