Conditions for Lokesh Padayatra: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి.. నారా లోకేశ్ తలపెట్టిన యువగళం పాదయాత్రకు నాన్చినాన్చీ అనుమతులిచ్చిన చిత్తూరు పోలీసులు దానికి 15 షరతులు, నిబంధనలు విధించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగినట్లు ఫిర్యాదులొచ్చినా.. షరతుల్లో ఏ ఒక్కటి పాటించకపోయినా ముందస్తు సమాచారం లేకుండా అనుమతి రద్దు చేసి చట్టపరమైన చర్యలూ తీసుకుంటామని పలమనేరు డీఎస్పీ సుధాకర్‌రెడ్డి.. ఆదేశాలు జారీ చేశారు. ఈ షరతులతో కూడిన అనుమతి కూడా ఈనెల 27 అర్ధరాత్రి 12 గంటల నుంచి 29 సాయంత్రం 5 గంటల 55 నిమిషాల వరకూ మూడు రోజుల పాటే వర్తిస్తుందని పేర్కొన్నారు.
జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీ రహదారులపై.. బహిరంగ సభలునిర్వహించొద్దని, అత్యవసర సేవలకు, నిత్యావసర సరకుల రవాణాకు ఆటంకం కలిగించకూడదని షరతు పెట్టారు. బహిరంగ సభకు తగిన ప్రదేశాన్ని ఎంపిక చేసుకుని ఆ వివరాలు పలమనేరు డీఎస్పీకి సమర్పించి అనుమతి పొందాలని సూచించారు. పాదయాత్ర లేదా రోడ్ షోను ప్రజలతో జరిపే ఇంటరాక్షన్ బహిరంగ సభలాగా ఉండకూడదన్నారు. రోడ్లపైగానీ, బహిరంగ ప్రదేశాల్లోగానీ.. ఇంటరాక్షన్ కావాలంటే మైక్ కోసం డీఎస్పీ అనుమతి పొందాలని ఈ కార్యక్రమాలను వీలైనంత వరకూ బహుళ ప్రవేశ, నిష్క్రమణ మార్గాలున్న ప్రదేశాల్లో నిర్వహించుకోవాలని కండీషన్ పెట్టారు. యాత్రలో డీజే సిస్టమ్స్, లౌడ్ స్పీకర్ల వినియోగం పూర్తిగా నిషేధమని.. తక్కువ శబ్దంతో సింగిల్ సౌండ్ బాక్స్ సిస్టమ్‌ను వినియోగించాలని.. స్పష్టం చేశారు. టపాసుల వినియోగం పూర్తిగా నిషిద్ధమని, మద్యం, మత్తు పదార్థాలు వాడొద్దని.. ఆదేశాల్లో సూచించారు. ఫ్లయింగ్ కెమెరాలు, డ్రోన్లు వినియోగించి చిత్రాలు తీయాలంటే.. డ్రోన్ నియమావళిని తప్పనిసరిగా పాటించాలన్నారు.
పాదయాత్రలో భద్రత, సమూహ నియంత్రణ, ట్రాఫిక్ నియంత్రణను.. నిర్వాహకులే చూసుకోవాలని, అందుకోసం పురుష, మహిళా వాలంటీర్లను.. ఏర్పాటు చేసుకోవాలన్నారు. వాలంటీర్లంతా ఒకే తరహా యూనిఫాం ధరించాలని.. వీరికి తగినన్ని తాళ్లు అందుబాటులో ఉంచాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పాదయాత్రలో పాల్గొనేవారెవరూ.. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం కలిగించకుండా చూడాల్సిన బాధ్యతా నిర్వాహకులదేనని.. నిబంధనల్లో స్పష్టం చేశారు. వాహనాల సంఖ్య పరిమితికి మించరాదని.. రూట్‌మ్యాప్‌కు తగినట్లు షెడ్యూల్‌కు, సమయానికి కట్టుబడే యాత్ర సాగాలని నిర్దేశించారు. రాత్రి బసచేసే ప్రదేశాల్లో అవసరమైన లైట్లు, బారికేడింగ్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ షరతుల్లో ఏ ఒక్కటి ఉల్లంఘించినా.. పూర్తి బాధ్యత నిర్వాహకులదేనని స్పష్టంచేశారు.
మరోవైపు.. పాదయాత్ర ప్రారంభమయ్యే జనవరి 27న కుప్పంలోని కమతమూరు రోడ్డులో నిర్వహించనున్న బహిరంగ సభకూ.. పోలీసులు 14 ఆంక్షలు విధించారు. నిర్దేశిత సమయానికే కట్టుబడి ఉండాలని.. ఒకవేళ మార్చదలిస్తే ముందస్తుగా పలమనేరు డీఎస్పీకి సమాచారమిచ్చి అనుమతి తీసుకోవాలని సూచించారు. బహిరంగ సభను, ప్రసంగాలను.. నిర్వాహకులే వీడియో తీసి.. ఒక కాపీని పలమనేరు.. డీఎస్పీకి సమర్పించాలన్నారు. తొక్కిసలాట జరగకుండా సభాస్థలిలో పటిష్ఠంగా బారికేడ్లు ఏర్పాటు చేసుకోవాలని.. వీఐపీలు కూర్చునే వేదిక కూలకుండా అధీకృత ఇంజినీర్ నుంచి ధ్రువీకరణ పత్రం పొందాలని.. పోలీసులు షరతు పెట్టారు. సభకు ఎంతమంది వస్తారని అంచనా వేస్తారో అంతకు 20 శాతం మందికి అదనంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సభా స్థలానికి విద్యుత్ శాఖ నుంచి కనెక్షన్, వాహనాల పార్కింగ్‌కు సంబంధిత భూ యజమానుల నుంచి నిరభ్యంతర పత్రం.. తీసుకోవాలన్నారు. అధికారుల అనుమతి లేకుండా బహిరంగ ప్రదేశాల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయరాదని, ఆధ్యాత్మిక ప్రదేశాలు.. సున్నిత ప్రాంతాల్లో ఫ్లెక్సీలు పెట్టకూడదన్నారు.
ఇవీ చదవండి: