అధిక రుసుం వసూలు
పంచాయతీ నిబంధనల ప్రకారం లారీ సరుకైనా సరే రూ.100 నుంచి రూ.150 లోపు వసూలు చేయాల్సిఉంది. కానీ నిబంధనలకు విరుద్ధంగా పాకాల సంత గుత్తేదారులు 800 నుంచి 1000 రూపాయల గేటు రుసుం వసూలు చేస్తున్నారు. మూడు వందల విలువ చేసే తమలపాకులు అమ్ముకోవాలన్న రూ.150 గేటు రుసుం కట్టాల్సిందే. పైగా చెల్లించిన రుసుముకు రశీదు మాటేలేదు.
పాకాల మార్కెట్లో గేటు రుసుం వసూలుకు ఏటా పంచాయతీ వేలం జరుగుతుంది. వేలంపాటలో అధిక వ్యయం చెల్లించిన వారు..గేటు రుసుం వసూలు చేస్తారు. ప్రతీయేడు నిర్వాహకులు మారినా వారి తీరులో మార్పు లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి తమ కష్టాన్ని దోచుకుంటూ...వసూలు దందా కొనసాగుతుందని ఆరోపిస్తున్నారు.
రశీదుల మాటే లేదు
సంతలో అమ్మకాలు, గేటు రుసుంపై పంచాయతీ స్పష్టమైన నిబంధనలు ఉన్నా అవి చెత్తబుట్టకే పరిమితం అవుతున్నాయి. ఇష్టానుసారం రేట్లను నిర్దేశించి వ్యాపారులు, రైతుల నుంచి అధిక రుసుం వసూలుచేస్తున్నారు.
కష్టపడి సాగు చేసుకున్నా, ప్రతిఫలం లేకుండా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న వసూళ్ల పర్వాన్ని స్థానిక శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి...బాధితులు తమ గోడును చెప్పుకున్నారు. రుసుం లేకుండా ఉచితంగా సంతలో అమ్ముకునేలా అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే ఆదేశించినా సదరు గుత్తేదారుల వసూళ్ల పర్వం ఆపలేదు.
రైతులు, వ్యాపారుల ఆవేదన ఇలా ఉంటే... వారాంతపు సంతను సేవాభావంతో నడుపుతున్నామని గుత్తేదారు చెప్పటం గమనార్హం. వ్యాపారులు, రైతులు తమతో సఖ్యతగా ఉంటున్న కారణంగా రశీదులు ఇవ్వటం లేదనీ...పంచాయతీ నిబంధనల మేరకే గేట్ రుసుం వసూలు చేస్తున్నామని చెబుతున్నారు.
రైతుల ఆవేదనను అధికారుల దృష్టికి ఈటీవీ భారత్ తీసుకెళ్లగా... మార్కెట్లో వసూళ్ల వ్యవహారంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. దశాబ్దకాలంగా పాకాల వారపు సంతను పట్టిపీడిస్తున్న ఈ వసూళ్ల పర్వం నుంచి తమను విముక్తులను చేయాలని రైతులు, వ్యాపారులు కోరుతున్నారు.
ఇదీ చదవండి : ఆ ఒక్కడి ప్రయాణం...వేల మందికి ఆదర్శం