పోరాటంతో ముందుకెళ్లడమే తప్ప వెనుతిరగడం తనకు తెలియదని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చెప్పారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడుపల్లె పర్యటనలో ఆయన ప్రసంగించారు. ప్రతిపక్షంలో ఉన్నా... నియోజకవర్గంలో తనకున్న ఆదరణ అద్భుతమని సంతోషం వ్యక్తం చేశారు. తాను ఎక్కడా ఏ తప్పు చేయలేదని.. ఐదేళ్ల పాటు అభివృద్ధే ధ్యేయంగా కష్టపడ్డాననీ చెప్పారు.
రాష్ట్రంలో సంపద సృష్టించి ఫలితాలు అందరికీ పంచాను. సంక్షేమ పథకాలతో మనిషి ప్రతీ దశలో తోడు ఉండేలా ప్రణాళికలు తెచ్చాం. కుప్పం కంటే ముందు పులివెందులకు నీళ్లు ఇచ్చాం. ఒత్తిడి తెచ్చి అయినా హంద్రీనీవా నీళ్లు కుప్పానికి తీసుకు వస్తా. హెచ్‌సీఎల్ వంటి కంపెనీలు అమరావతికి వచ్చేలా చేశా. కరువు జిల్లా అనంతకు నీళ్లు ఇచ్చి కియా తీసుకువచ్చా.
- చంద్రబాబు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి
కార్యకర్తల సంక్షేమంపైనా చంద్రబాబు మాట్లాడారు. ఇకపై.. కేడర్ గురించి తాను వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకుంటానని చెప్పారు. 13 బృందాలు నియమించి కార్యకర్తల ఆవేదన తెలుసుకుంటామన్నారు. పార్టీ శ్రేణులతో పాటు... ప్రజల సంక్షేమమే తొలి ప్రాధాన్యంగా పనిచేస్తానని స్పష్టం చేశారు.