రాజధాని అమరావతి కోసం చిన్న పిల్లలు సైతం రోడ్లపైకి వచ్చి పోరాడుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. తిరుపతిలో అమరావతి పరిరక్షణ సమితి నిర్వహిస్తోన్న ర్యాలీలో పాల్గొన్న ఆయన.. జై అమరావతి.. జైజై అమరావతి అంటూ తన ప్రసంగం ప్రారంభించారు. రాజధానిగా అమరావతి ఉండేలా వేంకటేశ్వరస్వామిని వేడుకుంటున్నానని చంద్రబాబు తెలిపారు. ఇంద్రుడు పాలించిన దేవతల రాజధాని పేరు కూడా అమరావతే అన్న ఆయన.. శాతవాహనుల కాలం నుంచి అమరావతి కేంద్రంగా పరిపాలన జరిగిందని గుర్తుచేశారు. అమరావతిని ఎందుకు మారుస్తున్నారని ప్రభుత్వాన్ని చంద్రబాబు నిలదీశారు. తను తిరుపతిలోనే చదువుకున్నానని గుర్తుచేసుకున్నారు. ఐకాస ర్యాలీలో పాల్గొనకుండా తెదేపా నేతలను అరెస్టు చేశారని చంద్రబాబు ఆరోపించారు.
రాజధాని అంటే వారికి అపహాస్యమైంది..!
తనను సైతం ర్యాలీలో పాల్గొనకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేశారని చంద్రబాబు ఆరోపించారు. రాజధాని అంటే వైకాపా నేతలకు అపహాస్యంగా ఉందని ఆరోపించారు. రాజధాని ఎందుకు మారుస్తున్నారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ప్రపంచవ్యాప్తంగా నాగరికత వెలిసింది నదీతీరాల్లోనే అని స్పష్టం చేశారు. అమరావతికి శంకుస్థాపన చేసింది ప్రధాని మోదీ అని గుర్తు చేసిన చంద్రబాబు.. సీఎంలు మారినప్పుడల్లా రాజధానులు మారతాయా? అని నిలదీశారు. హైదరాబాద్ లాంటి రాజధాని ఏపీకి వద్దా అని ప్రశ్నించారు.
ఒక్క పిలుపుతే 33 వేల ఎకరాలు
రాష్ట్ర విభజన తర్వాత అనేక కష్టాలు ఎదుర్కొన్నామన్న చంద్రబాబు... ఒక్క పిలుపు ఇస్తే రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారన్నారు. ఒక్క పైసా తీసుకోకుండా అన్నదాతలు భూములు ఇచ్చారని తెలిపారు. అమరావతిలో మొత్తం 55 వేల ఎకరాలు ఉందన్నారు. సీఎం జగన్ అభివృద్ధి చేతకాదని, కేవలం విధ్వంసం మాత్రమే వచ్చని విమర్శించారు. విశాఖలో 7 నెలలుగా దొంగలెక్కలు రాస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.
రాజధానికి, అభివృద్ధికి సంబంధం లేదు
విశాఖలో రాజధాని పెడితే రాయలసీమ జిల్లాలకు చాలా దూరమవుతుందని చంద్రబాబు అన్నారు. కుప్పం నుంచి విశాఖ వెళ్లాలంటే 950 కిలోమీటర్ల దూరం అవుతుందన్నారు. రాజధాని కావాలని విశాఖ వాసులు ఎప్పుడైనా అడిగారా? అని ప్రశ్నించారు. ఎక్కడైనా ఒక రాష్ట్రానికి ఒక రాజధానే ఉంటుందన్నారు. 3 రాజధానులని చెప్పడం అవమానం కాదా? అని నిలదీశారు. రాజధానికి, అభివృద్ధికి సంబంధం లేదన్నారు. రాజధాని కాకున్నా విశాఖ నగరం అభివృద్ధి చెందలేదా? అని ప్రశ్నించారు. డేటా సెంటర్, లులూ సెంటర్‌ను ఎందుకు రద్దు చేశారని నిలదీశారు.
రాజధానిని కాపాడుకోవాలి
రాష్ట్రాభివృద్ధి కోసం ఇంత తపన ఎందుకని కొందరు అడిగారన్న చంద్రబాబు... భావితరాలు బాగుండాలనేదే తన ఆలోచన అని స్పష్టం చేశారు. అసెంబ్లీలో 151 మందికి సమాధానం చెప్పగల సత్తా తనకు ఉందన్నారు. తానెప్పుడూ.. 25 ఏళ్ల యువకుడిగా ఆలోచిస్తానన్నారు. ఒకసారి అవకాశం ఇచ్చి మోసపోయామని రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారన్నారని చంద్రబాబు తెలిపారు. అమరావతిని కాపాడుకోకుంటే చరిత్ర క్షమించదన్న ఆయన.. అమరావతి పరిరక్షణ కోసం ప్రజా ఉద్యమం రావాలన్నారు. ప్రతి గ్రామం తుళ్లూరు, మందడంలా మారాలని పిలుపునిచ్చారు. అమరావతి రైతుల కోసం సాటిరైతులూ రోడ్డెక్కాలన్నారు. తిరుపతిలో రూ.2.84 లక్షల విరాళం వచ్చిందని చంద్రబాబు ప్రకటించారు.
ఒక రాష్ట్రం.. ఒక రాజధాని
ఒక రాష్ట్రం.. ఒక రాజధాని.. అనేదే ఐకాస నినాదమన్న చంద్రబాబు.. ఏపీ అంటే అమరావతి, పోలవరం అని పేర్కొన్నారు. ఈ రాష్ట్రానికి జీవనాడి అమరావతిని స్పష్టం చేశారు. ఉన్మాది పాలన చూసి పెట్టుబడిదారులు పారిపోతున్నారని చంద్రబాబు విమర్శించారు. తిరుపతిని ఎలక్ట్రానిక్స్ హబ్‌గా మార్చిన ఘనత తెదేపాదని ఆయన అన్నారు.
'ప్రత్యేక ప్రణాళికలతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను అభివృద్ధి చేయాలి. ఉత్తరాంధ్రలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టండి. రాజకీయాలు చేసి పబ్బం గడుపుకోవడం నీచాతినీచం. 9 ఏళ్లలో హైదరాబాద్ నగరాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశా. వైఎస్, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌ను చెడగొట్టలేదు. అమరావతిలో భవనాలన్నీ నిర్మించాం. ఇక వేటికి పునాదులు వేస్తారు?. ఈ ప్రభుత్వం చర్యలతో బాధ, ఆవేదన కలుగుతున్నాయి. '... తెదేపా అధినేత చంద్రబాబు
తెలంగాణ వాళ్లు నవ్వుకుంటున్నారు
మహిళలను కొట్టడం, దాడి చేయడంపై పోలీసులు ఆలోచించాలని చంద్రబాబు హితవు పలికారు. రైతులు, మహిళలపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. ఏపీ ప్రజలు రాజధాని కట్టుకోలేని అసమర్థులని తెలంగాణ వాళ్లు నవ్వుకుంటున్నారన్నారు. ఈ ప్రభుత్వ పరిపాలన వల్ల 15 మంది రైతులు చనిపోయారని తెలిపారు.
ఇదీ చదవండి: