భోగిమంటలు... సంక్రాంతులు... కనుమ పూజలు.... హరిదాసులు... ఒకప్పుడు ఇలా ఏ తెలుగింట చూసినా సంక్రాంతి వైభోగమే. భోగిపండ్లు, పిండివంటల ఘుమఘుమలతో కళకళలాడాల్సిన తెలుగు లోగిళ్లు రానురానూ పాశ్చాత్య సంస్కృతి ప్రభావానికి లోనవుతున్నాయి. మనదైన ప్రాభవాన్ని మెల్లిమెల్లిగా కోల్పోతున్న తరుణంలో అచ్చ తెలుగు సంప్రదాయాలను వివరించేలా ఓ వినూత్న ప్రయత్నం చేశారు తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం విద్యార్థినిలు. భోగి మొదలుకుని సంక్రాంతి, కనుమ రోజుల్లో పల్లె వాకిళ్లలో జరిగే ప్రతి సంబరాన్ని సాక్షాత్కరించారు.
దక్షిణాన్ని విడిచి... ఉత్తరానికి చేరుకునే భానుడు... మకరరాశిలో తొంగి చూసే సంక్రాంతి సంబరాలైతే మహిళా విశ్వవిద్యాలయంలో సరికొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చాయి. తెలుగింటి ఆడపడుచులంతా సంప్రదాయ వస్త్రధారణలో పల్లె పాటలకు పట్టం కడుతూ అదరహో అనిపించారు. కాయాకష్టం చేసిన రైతన్న చేతికందిన పంటను ఇంటికి తీసుకొచ్చిన దగ్గర నుంచి హరిదాసులు, డూడూ బసవన్నల మేళ తాళాలు ఇరుగు పొరుగుతో పండగను జరుపుకోవటం వరకూ ప్రతీ అంశాన్ని నృత్యరూపాల్లో ప్రదర్శిస్తూ ఆకట్టుకున్నారు.
సంక్రాంతి పండుగలో ముఖ్యమైన భోగి పండుగ ప్రాధాన్యతను చాటేలా భారీ భోగిమంటలను వేసి విద్యార్థులంతా నృత్యం చేశారు. పల్లె సీమలు మినహా పట్టణాల్లో పెరిగిపోతున్న అపార్ట్మెంట్ కల్చర్‌తో దూరమవుతున్న భోగి వేడుకల ప్రాధాన్యాన్ని విద్యార్థినిలు చాటి చెప్పారు. భోగిమంట భాగ్యం... వెచ్చనైన రాగం అంటూ విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
అందమైన రంగవల్లులు.... సంక్రాంతికున్న మరో విశిష్ఠతను చాటిచెప్పగా.... సంప్రదాయ శైలిలో విద్యార్థినిలు వాటిని తీర్చిదిద్ది పండగ పరమార్థాన్ని తెలియజేశారు. ఆడపిల్లలకు ఎంతో ఇష్టమైన గోరింటాకుల పోటీ కనుల విందుగా సాగింది. ఒకరితో ఒకరు పోటీ పడుతూ అందమైన డిజైన్లను చేతులపై తీర్చిదిద్దుకుని వాటిని చూసుకుంటూ మురిసిపోయారు. చివరిగా జరిగిన పతంగుల పోటీ పండగ విద్యార్థినిల ఆనందాన్ని శిఖరస్థాయికి తీసుకెళ్లింది. రంగు రంగుల గాలిపటాలను ఎంతో ఎత్తుకు ఎగురవేస్తూ చిన్నపిల్లల్లా మారిపోయారు. సంక్రాంతి పండగంటే ఇదీ అనే స్థాయిలో... వారికున్న వనరులను సమర్థంగా వినియోగించుకుని తెలుగింటి పండగ ప్రభను దశదిశలా ఘనంగా చాటారు.
ఇదీ చూడండి: రాజమహేంద్రి మహిళా కళాశాలలో సంక్రాంతి సంబరాలు